పరువు నష్టం కేసులో రాహుల్ కు చుక్కెదురు

సూరత్ కోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ సెషన్స్ కోర్టులో రాహుల్ పిటిషన్

rahul-gandhi

న్యూఢిల్లీః పరువు నష్టం కేసులో రాహుల్ కు కోర్టు షాక్ ఇచ్చింది. పరువు నష్టం కేసులో తన శిక్షపై స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దాఖలు చేసుకున్న పిటిషన్ ను సూరత్ సెషన్స్ కోర్టు కొట్టివేసింది. దీంతో రాహుల్‌ గాంధీపై శిక్ష కొనసాగనుంది. మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలపై సూరత్ కోర్టు ఇటీవల రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ కేసులో తనకు విధించిన శిక్షపై స్టే విధించాలంటూరాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఏప్రిల్ 20 గురువారం రోజున విచారణ జరగగా రాహుల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. ఈ కేసులో రాహుల్ కు రెండేళ్ల పాటు జైలుశిక్ష పడటంతో ఎంపీ పదవిపై అనర్హత వేటు పడింది. రేపు గుజ‌రాత్ హైకోర్టులో ఇదే కేసులో రాహుల్ పిటిష‌న్ వేయ‌నున్నారు.

“రాహుల్​కు విధించిన శిక్షలో ఒక్కరోజు తగ్గినా.. అనర్హత వేటు పడదని కోర్టుకు తెలుసు. ఆయన్ను దోషిగా తేల్చి అరగంట వ్యవధిలో అత్యంత కఠినమైన శిక్ష విధించారు. సుప్రీంకోర్టు రాహుల్​ను హెచ్చరించిందని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. సుప్రీం హెచ్చరికలను సైతం పట్టించుకోలేదని కఠిన వ్యాఖ్యలు చేసింది. కానీ, ఆయన ప్రసంగం.. సుప్రీం హెచ్చరికల కన్నా ముందే జరిగింది” అని రాహుల్​ తరఫు న్యాయవాది తెలిపారు.

2019 ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా కర్ణాటక లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మోడీ ఇంటిపేరుతో వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యల‌ను త‌ప్పుప‌డుతూ గుజ‌రాత్‌కు చెందిన బిజెపి నేత పూర్ణేశ్ మోదీ కోర్టులో కేసు దాఖ‌లు చేశారు.