ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్‌ను కొనసాగించొచ్చు ..డ‌బ్ల్యూహెచ్‌వో

జెనీవా: ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెనెకాకు చెందిన కొవిడ్‌-19 వ్యాక్సిన్ వినియోగాన్ని ఆపాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) శుక్ర‌వారం స్ప‌ష్టం చేసింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత ర‌క్త గ‌డ్డ క‌డుతున్న‌దంటూ ప‌లు దేశాలు ఈ వ్యాక్సిన్‌ను నిలిపేయ‌డంపై డ‌బ్ల్యూహెచ్‌వో స్పందించింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగాన్ని కొన‌సాగించాలి. దానిని వాడ‌కూడ‌ద‌నడానికి ఎలాంటి ఆధారాలు లేవు అని డ‌బ్ల్యూహెచ్‌వో అధికార ప్ర‌తినిధి మార్గ‌రెట్ హ్యారిస్ అన్నారు. డెన్మార్క్‌, నార్వే, ఐస్‌ల్యాండ్‌లాంటి యురోపియ‌న్ దేశాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల‌ను తాత్కాలికంగా నిలిపేసిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే యురోపియ‌న్ మెడిసిన్స్ ఏజెన్సీ కూడా ఈ వ్యాక్సిన్ వినియోగించాల‌ని సూచించింది. అందులోని ప్ర‌మాదాల కంటే ప్ర‌యోజ‌నాలే ఎక్కువ అని ఆ ఏజెన్సీ స్ప‌ష్టం చేసింది. 

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/