పెట్టుబడులు పెట్టనివారికి పన్నులు తగ్గించొద్దు!

నోబెల్‌ అవార్డు గ్రహీత కీలక వ్యాఖ్య

Abhijit Banerjee
Abhijit Banerjee

న్యూఢిల్లీ: ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ అవార్డు పొందిన అభిజిత్‌ బెనర్జీ ఇండియన్‌ కార్పొరేట్‌ సెక్టార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. 2020 బడ్జెట్‌ సందర్భంగా భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏమైనా సలహా ఇస్తారా అన్న ప్రశ్నకు జవాబిచ్చిన ఆయన ఇకపై కార్పొరేట్‌ పన్ను రేటు తగ్గించకూడదు. వారి వద్ద డబ్బులున్నా పెట్టుబడులు పెట్టడం లేదు అని సూచించారు. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ సృష్టించాలని ఆయన చెప్పారు. కార్పొరేట్‌ వర్గాలు డిమాండ్‌ లేకపోవడం వల్లే పెట్టుబడులకు ముందుకు రావడం లేదని వ్యాఖ్యానించారు. భారత సంతతికి చెందిన అభిజిత్‌ బెనర్జీ ఆర్థిక శాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2020-21 సంవత్సరానికి గాను పలు రంగాలకు కేటాయింపులు చేస్తారు. అలాగే వ్యక్తిగత ఆదాయపన్ను రేటు, కార్పొరేట్‌ పన్ను రేట్లను మరింతగా సవరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నా నేపథ్యంలో అభిజిత్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ మేరకు ఒక పత్రిక కథనం ప్రచురితమైంది. అభిజిత్‌ భార్య ఎస్తేర్‌ కూడా ఆర్థికవేత్తలే. దంపతులిద్దరూ ప్రభుత్వం ప్రజల వద్దకు డబ్బులు చేరేలా చూడాలని, ముఖ్యంగా పేదవారి చేతికి అవి చేరితే వినియోగం పెరుగుతుందని చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/