తెలంగాణలో నో లాక్‌డౌన్.. పెట్టినా ప్రయోజనం లేదట!

యావత్ భారతదేశాన్ని కరోనా మహమ్మారి ఎలా అల్లకల్లోలం చేస్తుందో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ వేవ్ కరోనా కంటే కూడా సెకండ్ వేవ్ కరోనా మరింత భయంకరంగా ఉండటంతో పరిస్థితులు కూడా అంతే భయానకంగా మారాయి. ముఖ్యంగా సెకండ్ వేవ్ కరోనా దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా తగ్గింపు చర్యలను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
ఈ క్రమంలో మరోసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పెట్టాలని డిమాండ్ వినిపిస్తోంది. కానీ కేంద్రం ఈ విషయంపై మల్లగుల్లాలు పడుతోంది. అయితే లాక్‌డౌన్ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చింది కేంద్రం. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. అయితే తెలంగాణలో కూడా లాక్‌డౌన్ పెట్టాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఆరోగ్య శాఖ అధికారులు, నిపుణులతో కరోనా పరిస్థితులపై సమీక్షించారు.
ఈ సమీక్ష అనంతరం, తెలంగాణలో లాక్‌డౌన్ విధించే ఆలోచనలో సర్కార్ లేదని ఆయన తెలిపారు. గతంలోనే లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయానికి భారీగా గండి పడిందని, రాష్ట్ర ప్రజలు కూడా తీవ్ర ఆర్ధిక నష్టాలను చవిచూశారని కేసీఆర్ తెలిపారు. దీంతో ఈసారి లాక్‌డౌన్ పెట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని కేసీఆర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించినా కూడా కేసుల సంఖ్య తగ్గడం లేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. దీంతో తెలంగాణలో లాక్‌డౌన్ లేదని స్పష్టం అయ్యింది. ఈ నిర్ణయంపై ప్రజల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది.