హువావేకు అమెరికాలో నో ఎంట్రీ

అనుమతులకు రద్దు

HUAWEI
HUAWEI


వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే ఒకరోజు ముందు కూడా డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాకు షాకిచ్చేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఇప్పటికే పలు యాప్స్‌పైన నిషేధం విధించిన ట్రంప్‌ తాజాగా మరో చర్యకు సిద్ధమవుతున్నారు.

చైనాని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు అన్ని ఆయుధాలను ప్రయోగిస్తున్నారు. గతంలోనే హువావేను టార్గెట్‌ చేసిన ఆయన, తాజాగా మరోసారి విరుచుకుపడుతున్నారు. ఈ చైనా టెలికం దిగ్గజం 5జి టెక్నాలజీకి ప్రసిద్ధి. అమెరికాలోను పలు దిగ్గజ కంపెనీలకు హువావే పరికరాలు సరఫరా చేస్తుంది. ఈ దిశగా ట్రంప్‌ చర్యలు తీసుకోనున్నారు.

ఇంటెల్‌ సహా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీలు హువావేకు పరికరాలు సరఫరా చేస్తాయి. ఇందుకు సంబంధించిన అనుమతులను రద్దు చేసేందుకు ట్రంప్‌ సిద్ధమయ్యారు. ఎగుమతుల కోసం కొత్తగా చేసుకున్న దరఖాస్తులను కూడా తిరస్కరించే యోచనలో ఉన్నారు. దాదాపు 150 అనుమతులను ట్రంప్‌ రద్దుచేయనున్నట్లు తెలుస్తోంది. వీటి విలువ దాదాపు 120 బిలియన్‌ డాలర్లు. మరో 280 బిలియన్‌ డాలర్ల ఒప్పందాల కోసం చర్చలు జరుగుతుండగా, ట్రంప్‌ చర్యలతో వీటిపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి.

హువావేకు అమెరికా నుంచి ఎలాంటి పరికరాలు అందవద్దనేది ట్రంప్‌ టార్గెట్‌గా కనిపిస్తోంది. హువావే టార్గెట్‌గా పలు అమెరికా కంపెనీలకు అమెరికా వాణిజ్య శాఖ నోటీసులు ఇచ్చింది. ఇరవై రోజుల్లో సమాధానం చెప్పాలని అందులో పేర్కొంది. 5జి టెక్నాలజీకి సంబంధించి హువావే ప్రపంచంలో అగ్రగామిగా ఎదగాలని భావిస్తోంది. ట్రంప్‌ ఆ సంస్థకు కొరకురాని కొయ్యలా మారారు. చైనా కంపెనీలు, టెక్నాజలీ వల్ల సమాచార దోపిడీ ఉందని ఆరోపిస్తూ వస్తున్నారు.

హువావేను బహిష్కరించాలని ఇతర దేశాలను కూడా కోరారు. దీంతో హువావేతో ఉన్న ఒప్పందాన్ని ఇప్పటికే బ్రిటన్‌ రద్దుచేసుకుంది. ఇందుకు సంబంధించి ఇంటెల్‌ కార్ప్‌ సహా ఇతర సంస్థలు స్పందించాల్సిఉంది.

ఇప్పటికే నాలుగు సంస్థలకు చెందిన ఎనిమిది లైసెన్స్‌లు రద్దుచేసినట్లుగా తెలుస్తోంది. జపానీస్‌ ప్లాష్‌ మెమోరీ చిప్‌ మేకర్‌ కియోక్సియా కార్ప్‌కు సంబంధించి ఒక లైసెన్స్‌ రద్దయినట్లుగా తెలుస్తోంది. గతంలో ఈ కంపెనీ తోషిబా మెమోరీ కార్ప్‌ పేరుతో ఉంది.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/