భారత్‌-చైనా ఘర్షణలో మరణాలు, తీవ్ర గాయాలు లేవుః రాజ్‌నాథ్‌ సింగ్‌

చైనా ద‌ళాలు చేసిన ప్ర‌య‌త్నాల్ని మ‌న సైనికులు ధైర్యంగా అడ్డుకున్నారు..రాజ్‌నాథ్‌

No deaths, no serious injuries in India-China Arunachal border clash, says Rajnath Singh

న్యూఢిల్లీః అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని త‌వాంగ్ సెక్టార్‌లో చైనా సైనికుల‌తో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ గురించి ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు లోక్‌స‌భ‌లో ప్ర‌క‌ట‌న చేశారు. ఆ ఘ‌ర్ష‌ణ‌లో ఒక్క సైనికుడు కూడా మృతి చెంద‌లేద‌ని, ఒక్క‌రు కూడా తీవ్రంగా గాయ‌ప‌డ‌లేద‌ని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. డిసెంబ‌ర్ 9వ తేదీన త‌వాంగ్ సెక్ట‌ర్‌లోని యాంగ్జి ప్రాంతంలో చైనా ద‌ళాలు భార‌త భూభాగంలోకి ప్ర‌వేశించాయ‌ని, ఆ ద‌ళాలు ఆక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డిన‌ట్లు రాజ్‌నాథ్ తెలిపారు. చైనా ద‌ళాలు చేసిన ప్ర‌య‌త్నాల్ని మ‌న సైనికులు స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

భూభాగాన్ని ఆక్ర‌మించ‌కుండా పీఎల్ఏను మ‌న సైనికులు ధైర్యంగా అడ్డుకున్న‌ట్లు మంత్రి తెలిపారు. చైనా సైనికులను విజ‌య‌వంతంగా త‌మ పోస్టు నుంచి వెళ్లగొట్టార‌న్నారు. చైనా ప్ర‌భుత్వంతో ఈ అంశం గురించి దౌత్య‌ప‌ర‌మైన ప‌ద్ధ‌తిలో చ‌ర్చించిన‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. స‌రిహ‌ద్దుల్ని ర‌క్షించేందుకు మ‌న ద‌ళాలు క‌ట్టుబ‌డి ఉన్నాయ‌న్నారు. ఎవ‌రైనా మ‌న భూభాగంలోకి ప్ర‌వేశించాల‌ని చూస్తూ వాళ్లను స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకుంటామ‌న్నారు. పీఎల్ఏతో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ఇరు వైపులకు చెందిన ద‌ళాల‌కు స్వ‌ల్ప గాయాలైన‌ట్లు రాజ్‌నాథ్ తెలిపారు. మ‌న సైనికుల్లో ఒక్క‌రు కూడా చనిపోలేద‌ని, తీవ్రంగా గాయ‌ప‌డ‌లేద‌న్నారు. భార‌తీయ మిలిట‌రీ క‌మాండ‌ర్లు స‌రైన స‌మ‌యంలో జోక్యం చేసుకోవ‌డం వ‌ల్ల‌… పీఎల్ఏ ద‌ళాలు వెన‌క్కి వెళ్లిన‌ట్లు మంత్రి చెప్పారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/