దసరా ఉత్సవాల్లో కీలక ఘట్టంపై రాని స్పష్టత…?

దసరా ఉత్సవాల ఆఖరి రోజు కృష్ణా నదిలో దుర్గమ్మ నదీ విహారంపై అసలు స్పష్టత రావడం లేదు. ఇప్పటి వరకు కరోనాను దృష్టిలో ఉంచుకుని ఉత్సవాలు నిర్వహించారు. కాని తెప్పోత్సవం విషయంలో మాత్రం క్లారిటీకి అధికారులు రావడం లేదు. పై నుంచి భారీగా వర్షాలు పడుతున్న నేపధ్యంలో కృష్ణా నదికి భారీగా వరద వస్తుంది. మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసారు.

కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతుండడం తో ఈ నెల 25 న తెప్పోత్సవం నిర్వహించాలా లేదా అనే దానిపై డైలమాలో దుర్గగుడి అధికారులు ఉన్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి వద్ద 3 లక్షల 77 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. తెప్పోత్సవం కు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. కృష్ణా నది లో వరద ఉధ్రుతి తగ్గితేనే తెప్పోత్సవానికి అనుమతులిస్తామని ఇరిగేషన్ శాఖ అధికారులు అంటున్నారు.

ప్రస్తుత పరిస్ధితుల్లో వరద ఉదృతి తగ్గినా సరే కృష్ణా నదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం నిర్వహించడం సాధ్యపడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే హంస వాహనాన్ని సిద్దం చేసి ఉంచారు దుర్గగుడి అధికారులు. ఈ నెల 25 ఉత్సవాల ఆఖరి రోజైన ఆదివారం కృష్ణా నదిలో ఉదృతి తగ్గితే నిర్వహించవచ్చు అని మరికొందరు అంటున్నారు.