బిగ్‌బాస్ 5.. ఈసారి లేనట్టే!

తెలుగు టెలివిజన్‌లో రియాలిటీ షోలలో బిగ్ బాస్ షోకు ఉన్న ప్రత్యేకత వేరు. ఈ షోను తొలుత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, ఆ తరువాత రెండో సీజన్‌ను నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఇక మూడు, నాలుగు సీజన్‌లకు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌కు కూడా మంచి గుర్తింపు వస్తుండటంతో, ఈసారి బిగ్ బాస్ షో ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే గతేడాది కరోనా విలయతాండవం కారణంగా సెప్టెంబర్ నెలలో ప్రారంభమైన బిగ్ బాస్ షో, ఈసారి మరింత ఆలస్యం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈసారి బిగ్ బాస్ షోను నిర్వహించకూడదని షో నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా ప్రభంజనం తీవ్రంగా ఉండటంతో, కంటెస్టెంట్స్ ప్రాణాలతో తాము రిస్క్ తీసుకోలేమని నిర్వాహకులు చేతులెత్తేశారట.

అందుకే బిగ్ బాస్ 5 ఈ యేడాది లేనట్టే అని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బిగ్ బాస్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇంట్లో కూర్చుని తమను ఎంటర్‌టైన్ చేసే బిగ్ బాస్ లాంటి షో నిర్వాహకులు ఈసారి షో లేదనం తమకు నిజంగా బాధను కలిగిస్తుందని, అయినా కంటెస్టెంట్స్ ప్రాణాలు కూడా ముఖ్యం కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం హర్షించతగ్గ విషయమని పులువురు అంటున్నారు.