ల‌ఖింపుర్ ఖేరి ఘ‌ట‌న‌పై స్పందించిన సీఎం యోగి

ఆధారాలు లేకుండా అరెస్టు చేయం.. సీఎం యోగి

గోర‌ఖ్‌పూర్‌: ల‌ఖింపుర్ ఖేరిలో జ‌రిగిన హింస‌లో 8 మంది మృతిచెందిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ మాట్లాడుతూ..లఖింపూర్ ఘ‌ట‌న‌లో ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవ‌ర్నీ అరెస్టు చేయ‌లేమ‌ని అన్నారు. కేంద్ర మంత్రికి చెందిన కారు ఢీకొట్ట‌డం వ‌ల్ల న‌లుగురు రైతులు మ‌ర‌ణించారు. అయితే ఈ కేసులో కేంద్ర మంత్రి మిశ్రా కుమారుడు ఆశిష్‌ను అరెస్టు చేయాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చ‌ట్టం ముందు ప్ర‌తి ఒక్క‌రూ స‌మాన‌మే అని, సుప్రీంకోర్టు కూడా ఇదే చెబుతోంద‌ని, ఎటువంటి ఆధారం లేకుండా ఎవ‌ర్నీ అరెస్టు చేయ‌లేమ‌ని, ఈ కేసులో ద‌ర్యాప్తు జ‌రుగుతోంద‌ని సీఎం యోగి తెలిపారు.

లిఖితపూర్వ‌క ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ న‌మోదు చేశామ‌ని, ఎవ‌ర్నీ వ‌దిలిపెట్టేదిలేద‌ని సీఎం చెప్పారు. ఎవ‌రికీ అన్యాయం చేయ‌మ‌ని, అలాగే ఒత్తిడిలో ఎటువంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌బోమ‌న్నారు. ప్ర‌జాస్వామ్యంలో హింస‌కు చోటు లేద‌ని, చ‌ట్టం ప్ర‌తి ఒక్క‌రికీ ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంటే, ఆ చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, అది ఎవ‌రైనా ప‌ర్వాలేద‌ని సీఎం యోగి అన్నారు. ల‌ఖింపూర్ వెళ్తున్న ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. వాళ్లేమి శుభ‌సందేశ‌కులు కాద‌న్నారు. శాంతి, సామ‌రస్యాన్ని నెల‌కొల్ప‌డ‌మే ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త అని, ఖేరికి వెళ్దామ‌నుకుంటున్న‌వారే అక్క‌డ జ‌రిగిన హింస‌కు కార‌ణ‌మ‌ని, విచార‌ణ త‌ర్వాత అన్ని అంశాలు స్ప‌ష్టంగా బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని సీఎం చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/