చెరువు అలుగు పడింది..ఫ్రీగా కోళ్లు దొరికాయి

చెరువు అలుగు పడడానికి..చికెన్ వండుకోవడానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా..అయితే ఈ ఫుల్ స్టోరీ చదవాల్సిందే. గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాల దెబ్బకు వాగులు , వంకలు , చెరువులు పొంగిపొర్లతున్నాయి. గత 10 ఏళ్లలో చూడని వర్షం ఈసారి పడిందని ప్రజలు చెపుతున్నారు. ఇక నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడ్డాయి. ప్రధాన రహదారులు సైతం నదులను తలపిస్తున్నాయి. ఎక్కడిక్కడే రోడ్లు తేగిపోవడం తో రాకపోకలు బంద్ అయ్యాయి.

ఇక నిజామాబాద్ జిల్లాలోని జాక్రాన్ పల్లి మండలం చింతలూరులో భారీ వర్షాలకు దరకాసు చెరువు ఉప్పొంగుతోంది. చెరువు నిండి మత్తడి పారుతోంది. అయితే, చెరువు పక్కనే ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన కోళ్ల ఫాం ఉంది. ఆ నీటి ప్రవాహంతో కోళ్ల ఫాం నీట మునిగిపోయింది. అంతే ఫారంలో ఉన్న కోళ్లు వరద ప్రవాహానికి పక్కనే ఉన్న పొలాలు, గ్రామాల్లోకి కొట్టుకుపోయాయి. మిగిలిన కోళ్లను స్థానిక ప్రజలు వచ్చి పట్టుకెళ్లారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా డజన్ల కొద్ది కోళ్లను పట్టుకుపోయారు. ఫ్రీగా కోళ్లు దొరికే సరికి ఆ ఊరు వారే కాదు చుట్టుపక్కల వారు సైతం పొల్లాలో పరుగులు తీసి కోళ్లను పట్టుకున్నారు. ఒక్కొక్కరు చేతికి ఎన్ని దొరికితే అన్ని పట్టుకున్నారు. మరికొంతమంది అయితే బస్తాలో వేసుకొని వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కోళ్ల వల్ల ఆ ఊరంతా చికెన్ వండుకున్నారు.

YouTube video