ఏడో నిజాం కూతురు కన్నుమూత

మీర్ ఉస్మాన్ 34 మంది సంతానంలో బతికున్న ఆఖరి మహిళ

Basheerunnisa Begum

హైదరాబాద్‌: ఏడో నిజాం రాజు మీర్‌ఉస్మాన్‌ అలీఖాన్‌ కూతురు సాహెబ్‌జాదీ బషీరున్ని సాబేగం సాహెబా (93) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌ పురానాపూల్‌లోని తన నివాసంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. 1927లో జన్మించిన ఆమె ఏడో నిజాం చివరి సంతానం. నిజాం స్టేట్‌ మ్యూజియం ఆవరణలోని పురానీహవేలీ ఉస్మాన్‌ కాటేజీలో నివాసముంటున్నారు. బషీరున్నిసా బేగం సాహెబాకు కూతురు రషీదున్నిసా బేగం ఉన్నారు. పలువురు నిజాం కుటుంబసభ్యులు, వారి సన్నిహితులు ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. కాగా 1906లో అజామ్ ఉన్నీసా బేగంతో మీర్ ఉస్మాన్ కు వివాహం కాగా, 1927లో బషీరున్నీసా బేగం జన్మించారు. ఈమె భర్త నవాబ్ ఖాజీంయార్ జంగ్ గతంలోనే మరణించారు.

కాగా, మీర్ ఉస్మాన్ కు 34 మంది సంతానం కాగా, ఇప్పటి వరకూ జీవించి ఉన్నది బషీరున్నీసా మాత్రమే. ఇప్పుడు ఆమె కూడా కన్నుమూయడంతో, మీర్ ఉస్మాన్ తదుపరి తరం అంతరించినట్లయింది. దక్కన్ హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే నగలను ధరిస్తూ, ఆమె ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలిచారు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉండగా, కుమారుడు దాదాపు 25 సంవత్సరాల క్రితం తప్పిపోయాడు. ఇంతవరకూ అతని ఆచూకీ లభించక పోవడం గమనార్హం.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/