బలహీన పడిన ‘నివర్‌’

అతి త్రీవ తుపాను నుండి తీవ్ర తుపానుగా మరిన నివర్‌

Nivar cyclone

విశాఖపట్నం: అతి తీవ్ర తుపానుగా ఉన్న నివర్, తీరాన్ని దాటిన తరువాత బలహీనపడి తీవ్ర తుపానుగా మారింది. నివర్ గమనం ప్రస్తుతం పశ్చిమ ఏపి, తూర్పు కర్ణాటకల వైపు ఉందని, ఇది మధ్యాహ్నం తరువాత మరింత బలహీనపడి తుపానుగా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. నివర్ తుపాను చెన్నైని దాటి ఉత్తర దిశగా సాగుతుండగా, ఇప్పటికీ తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తూనే ఉంది. ఏపి లోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై నివర్ పెను ప్రభావం చూపుతుండగా, అనంతపురం, కడప జిల్లాల్లో ఇప్పుడే భారీ వర్షం మొదలైంది. బెంగళూరునూ తుపాను ప్రభావం తాకింది. ఇప్పటికే వేలాది మంది జాతీయ విపత్తు నిర్వహణ బృంద సభ్యులు తమిళనాడు, ఏపి, పుదుచ్చేరి రాష్ట్రాల్లో మోహరించి, సహాయక చర్యలకు ఉపక్రమించారు. ముందు జాగ్రత్త చర్యగా, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. విరిగిపడిన చెట్లను తొలగించే పనులు ప్రారంభం అయ్యాయి.

తుపాను బలహీనపడినప్పటికీ, పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, కుంభవృష్టికి అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ ట్వీట్ చేసింది. నివర్ తుపాను సముద్రాన్ని పూర్తిగా దాటేసి, ప్రస్తుతం తాను ప్రయాణిస్తున్న మార్గంలో భారీ వర్షాలను కురిపిస్తూ క్రమంగా బలహీనపడుతోంది. భారత వాతావరణ శాఖకు సంబంధించినంత వరకూ తుపానుల తీవ్రతను ఏడు రకాలుగా లెక్కిస్తుండగా, నివర్ ఐదో రకం తీవ్రతతో కూడిన తుపాను అని అధికారులు వెల్లడించారు. చెన్నై విమానాశ్రయంలో మధ్యాహ్నం తరువాత సర్వీసులను తిరిగి పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు. మెట్రో సేవలు రేపు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/