‘నివర్’‌ తుపాను..ఏపి, తెలంగాణ, తమిళనాడు లకు ముప్పు

నేడు వాయుగుండంగా, రేపు తుపానుగా మారే అవకాశం

nivar-cyclone

హైదరాబాద్‌: ఏపి, తెలంగాణలో, తమిళనాడు రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా, రేపు తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ తుపానుకు ఇరాన్ దేశం సూచించిన  ‘నివర్’  అని పేరుపెట్టింది. నివర్ ఎల్లుండి తమిళనాడు, పుదుచ్చేరి తీరంలోని కరైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి, ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో ఇప్పటికే వర్ష ప్రభావం ఉందని, రాయలసీమలో రేపటి నుంచి, ఎల్లుండి నుంచి తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాల వెంబడి గంటకు 45 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు, అరేబియా సముద్రంలో ఇప్పటికే ఏర్పడిన ‘గతి’ తుపాను కొనసాగుతోంది. అయితే, ఇది పశ్చిమ తీరానికి దూరంగా ఉన్నప్పటికీ, వర్షం పడే అవకాశం మాత్రం ఉందని చెబుతున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/