వరదలు బీహార్‌లోనే వచ్చాయా మరెక్కడా రాలేదా?

మీడియాపై నితీష్‌ రుసరుసలు

nitesh kumar
nitesh kumar


పాట్నా: ఎడతెరిపి లేని వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. భారీ వర్షాలకు బీహార్‌ రాష్ట్రం అల్లాడుతోంది. వర్షాలతో రాష్ట్రంలోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తీర ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రాష్ట్ర రాజధాని పాట్నాలో భారీ వర్షాలతో చాలా ప్రాంతాలు వరదలతో నిండిపోయాయి. వీధులు పూర్తిగా జలమయం కావడంతో ప్రజలను తెప్పల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోడీ నివాసం కూడా నీటిలో మునిగింది. ఆయన కుటుంబాన్ని జాతీయ విపత్తు నిర్వహణ దళం మరో చోటుకు తరలించారు. వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలను ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ రాష్ట్రంలో పర్యటించారు. ఆయన పునరావాస శిబిరాలను సందర్శించారు. పాట్నాలోని శ్రీ కృష్ణ స్మారక ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో వరద బాధితులు నిరసన తెలిపారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని కనీస సౌకర్యాలు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో నితీష్‌కుమార్‌ స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న వరద సహాయక చర్యలు, పురావాస శిబిరాల్లో సౌకర్యాల ఏర్పాటు గురించి కొందరు ప్రతినిధులు ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ప్రశ్నించారు. దాంతో అసహనానికి గురైన ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీహార్‌లో, పాట్నాలో మాత్రమే వరదలు వచ్చాయా? ప్రపంచంలో మరెక్కడా రాలేదా? అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. పాట్నాలో కొన్ని ప్రాంతాలు వరద ప్రభావానికి గురైనంత మాత్రాన అంతా మునిగిపోయిందని చెప్పడం సరికాదన్నారు. సహాయక చర్యలు మరింతగా తీసుకుంటామని చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి….https://www.vaartha.com/news/national/