పెట్రో, డీజిల్‌ ధరల పెరుగుదలపై నిర్మలా సీతారామన్‌ స్పందన

గత 12 రోజుల్లో పెరిగిన పెట్రోల్‌ ధర రూ. 3.63, డీజిల్‌ ధర రూ. 3.84

Nirmala Sitharaman’s response

New Delhi: భారతదేశంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు వరుసగా 12వ రోజు కూడా పెరిగి జనాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలా రోజూ పెరుగుతున్న ఇంధన ధరలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ’ఇది చాలా ఆందోళనకలిగించే అంశం. ధర పడిపోవడం తప్ప దీనికి వేరే జవాబే లేదు’ అని స్పందించారు.

ఇంధన ధరల పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు విపరీతంగా పెరగడమే కారణమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌ (ఒపెక్‌) తమ ముడి చమురు ఉత్పత్తిని తగ్గించాలని అకుంటున్నదని, ఇదే జరిగితే ఇంధన ధరలు మరింతగా పెరిగే ప్రమాదం ఉన్నదని ఆమె అన్నారు.

అయితే సామాన్య మానవునిపై ఇంధన ధరల ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్రం, రాష్ట్రాలు కూర్చొని చర్చించి రీటైల్‌ వినియోగదారులకు ఇంధన ధరను రీజనబుల్‌ ధరకు అందించే ప్రయత్నం జరగాలని ఆర్థిక మంత్రి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రీటైల్‌ పెట్రోల్‌ అమ్మకాలపై 60 శాతం, డీజిల్‌పై 54 శాతం పన్నులను విధిస్తాయి.

కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించినా రాష్ట్రాలు ఆ మేర లోటును పూర్తి చేస్తాయనే గ్యారంటీ ఏమీ లేదని సీతారామన్‌ అన్నారు. శనివారం నాడు పెట్రోల్‌ ధర రికార్డు స్థాయిలో ఒక్క రోజే లీటర్‌కి 39 పైసలు పెరిగింది. అలాగే డీజిల్‌ ధర 37 పైసలు పెరిగింది.

2017లో ఆయిల్‌ కంపెనీలు ఇంధన ధరలను రోజువారీగా రివైజ్‌ చేయడానికి పూనుకున్నప్పటి నుంచి శనివారం పెరిగిన ధరే అత్యధికం.శనివారం పెట్రోల్‌ ధర ముంబయిలో లీటర్‌కి రూ.97 పెరిగి ఆల్‌టైం రికార్డును సృష్టించింది.

డీజిల్‌ రేటు రూ.88 ని దాటింది. ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.90.58 మార్క్‌కి చేరింది. డీజిల్‌ ధర రూ. 80.97కి చేరింది. అయితే ఇప్పటికే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ల్లో పెట్రోలు ధరలు రూ. 100ను దాటింది.గత 12 రోజుల్లో రిటైల్‌ పెట్రోల్‌ లీటర్‌కి ధర రూ.3.63 పెరిగింది.

2010లో ఇంధన ధరలపై నియంత్రణను తొలగించినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ స్థాయిలో ధర పెరగటం ఒక రికార్డు.

డీజిల్‌ ధర గత 12 రోజుల్లో లీటర్‌కి రూ. 3.84 పెరిగింది.గత ప్రభుత్వాలు ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగించి ఉంటే ఇప్పుడు మధ్యతరగతివారిపై ఇంత భారం పడేది కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతవారం ఇంధన ధరల పెరుగుదలపై వ్యాఖ్యానించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/