లఖింపూర్ ఖేరి హింస ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి నిర్మల

ఖండించాల్సిందేనన్న నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరి హింస ఘటనపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటనను కచ్చితంగా ఖండించి తీరాల్సిందేనన్నారు. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో కేంద్ర మంత్రి కుమారుడి కాన్వాయ్ లోని కారు ఢీకొని నలుగురు రైతులు మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలు, కారు డ్రైవర్, జర్నలిస్ట్ సహా నలుగురిని రైతులు కొట్టి చంపారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో వున్న మంత్రి నిర్మల.. బోస్టన్ లోని హార్వర్డ్ కెనడీ స్కూల్ లో విద్యార్థులతో మాటామంతి జరిపారు. ఈ సందర్భంగా లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ , కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించట్లేదని ఆమెను విద్యార్థులు ప్రశ్నించారు. లఖింపూర్ ఖేరి ఘటనను ఖండించాల్సిందేనని, అయితే, ఇలాంటి ఘటనలే దేశంలోని చాలా చోట్ల జరుగుతున్నాయని, వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆమె ప్రశ్నించారు.

యూపీలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టే ప్రశ్నిస్తున్నారని, రాజకీయ స్వార్థం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె సమాధానమిచ్చారు. ‘‘ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు, అమర్త్యసేన్ లాంటి వారు గళం విప్పుతున్నారు. మంచిదే. అయితే, అది కేవలం వారికి సూట్ అవుతుందనిపిస్తేనే మాట్లాడుతున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరిగితేనే గొంతెత్తుతున్నారు. వేరే చోట జరిగితే ఎందుకు మాట్లాడడం లేదు? వాటిపైనా మాట్లాడితే బాగుంటుంది. అక్కడ కేంద్ర మంత్రి కార్యక్రమం ఉంది కాబట్టి.. ఘటనకు మంత్రి, ఆయన కుమారుడే కారణమని అనుకుంటున్నారు. సమగ్ర విచారణ తర్వాత నిందితులకు శిక్ష పడుతుంది. బాధితులకు న్యాయం జరుగుతుంది’’ అని ఆమె అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/