తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగలబోతుందా..?

Nirmal Congress Leader Rama Rao Patel Will Join IN BJP

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కి మరో షాక్ తగలబోతుందా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోతుంది. ఏ ఎన్నికలు జరిగిన కూడా గెలువలేకపోతుంది. ఒకవేళ గెలిచినప్పటికీ ఆ నేతలు బిజెపి తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే మరి దారుణంగా తయారైంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టడం తో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని కార్య కర్తలు భావించారు. కానీ అదేమీ లేదని మునుగోడు ఉప ఎన్నిక తో తేలిపోయింది. నేతల మధ్య విభేదాలు పార్టీకి తీవ్ర నష్టాన్ని తెచ్చి పెడుతుంది. దీంతో పార్టీ ని నమ్ముకున్న నేతలు, కార్య కర్తలు ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు టిఆర్ఎస్ , బిజెపి పార్టీల్లోకి చేరగా..తాజాగా మరో కీలక నేత సైతం బిజెపి వైపు చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామారావు పాటిల్.. త్వరలోనే ఆయన బిజెపి గూటికి చేరుకోవడం ఖాయమనే ఊహాగానాలు రాజకీయాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. సోమవారం బైంసాలోని తన అనుచరులతో రామారావు పాటిల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ మార్పుపై ప్రకటన చేయనున్నారనే వార్తలు వినిపిస్తోన్నాయి. పార్టీ మార్పుపై అనుచరులతో చర్చించిన అనంతరం ప్రకటన చేస్తారని చెబుతున్నారు. ఆయన పార్టీ మారుతారని గత రెండు రోజులుగా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోన్న క్రమంలో.. అనుచరులతో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

2018 ఎన్నికల్లో ముథోల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరపున రామారావు పాటిల్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు అవకాశం కల్పించారు. కొంతకాలంగా కాంగ్రెస్‌లో అసంతృప్తితో ఉన్న రామారావు పాటిల్‌తో బీజేపీ నేతలు టచ్‌లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. తమ పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ నేతలు కోరడంతో.. కాషాయ కండువా కప్పుకునేందుకు రామారావు పాటిల్ ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.