నీరవ్‌ మోడిని భారత్‌కు అప్పగించాల్సిందే..యూకే కోర్టు

రూ.14 వేల కోట్లు ఎగవేసి పారిపోయిన నీరవ్ మోడి

లండన్‌: వజ్రాల వ్యాపారి నీరవ్ మోడికి యూకే కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. నీరవ్ మోదీపై మోపిన మనీ లాండరింగ్ అభియోగాలు రుజువయ్యాయని యూకే కోర్టు తీర్పు వెలువరించింది. ఆ కేసులో నీర‌వ్ మోదీని దోషిగా తేల్చేందుకు కావాల్సిన అన్ని ఆధారాలు ఉన్న‌ట్లు న్యాయ‌మూర్తి తెలిపారు. పీఎన్‌బీ మ‌నీల్యాండ‌రింగ్ కేసులో నీర‌వ్ మోడిని భార‌త్‌కు అప్ప‌గించాల‌ని జ‌డ్జి సామ్యూల్ త‌న తీర్పులో ఆదేశించారు. వ‌జ్రాల వ్యాపారి నీర‌వ్ మోడి కేసు రెండున్న‌ర ఏళ్లుగా యూకే కోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. మోసం, మ‌నీల్యాండ‌రింగ్ కింద అత‌నిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

వాండ్స్‌వ‌ర్త్ జైలు నుంచి అత‌ను వెస్ట్‌మినిస్ట‌ర్ మెజిస్ట్రేట్‌ కోర్టు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు. డిస్ట్రిక్ జ‌డ్జి సామ్యూల్ గూజీ ఈ కేసులో తీర్పును వెలువ‌రించారు. అయితే మ‌నీల్యాండ‌రింగ్ కేసులో నీర‌వ్ మోడిని దోషిగా తేల్చేందుకు కావాల్సిన సాక్ష్యాధారాలు ఉన్న‌ట్లు ఆ జ‌డ్జి తెలిపారు. మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును యూకే హోంశాఖ మంత్రి ప్రీతిపాటిల్‌కు తెలియ‌జేయ‌నున్నారు. పీఎన్‌బీకి కోట్లు ఎగ‌వేసిన కేసులో నీర‌వ్‌ను అప్ప‌గించాల‌ని బ్రిట‌న్‌ను భార‌త్ కోరుతున్న విష‌యం తెలిసిందే. ఒక‌వేళ నీర‌వ్‌ను భార‌త్‌కు అప్ప‌గిస్తే, అక్క‌డ ఆయ‌న‌కు న్యాయం జ‌ర‌గ‌ద‌న్న దాంట్లో వాస్త‌వం లేద‌ని కూడా కోర్టు అభిప్రాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. నీర‌వ్‌కు వ్య‌తిరేకంగా భార‌త్ త‌మ‌కు 16 సంపుటాల ఆధారాల‌ను స‌మ‌ర్పించింద‌ని, భార‌త ప్ర‌భుత్వం స‌మ‌ర్పించిన ఆధారాల‌ను గుర్తిస్తున్న‌ట్లు జ‌డ్జి వెల్ల‌డించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/