బ్రేకింగ్ న్యూస్: తెలంగాణలో నేటి నుండి రాత్రి కర్ఫ్యూ

కరోనా సెకండ్ వేవ్ యావత్ భారతదేశాన్ని అతలాకుతలం చేస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మర చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధించాయి. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణలో కూడా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో, కేసీఆర్ ప్రభుత్వం వెంటనే లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ విధించాలంటూ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు కూడా కరోనా సోకడంతో, ప్రభుత్వ ఆరోగ్య శాఖ తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించి, ఈ మేరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నైట్ కర్ఫ్యూ నేటి రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఉంటుందని, ఈ నెల 31 వరకు ఈ రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.

ఇక ఈ రాత్ర కర్ఫ్యూ సమయంలో కేవలం అత్యావసర సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయని ప్రభుత్వాధికారులు తెలిపారు. రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, ఇతర షాపులు అన్నీ కూడా రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. కరోనాను కట్టడి చేయాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎస్ పేర్కొన్నారు.