ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగింపు

రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ

అమరావతి : సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు. ఏపీలో మరో వారం పాటు రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయించారు. ఇప్పటికీ ఓ మోస్తరు సంఖ్యలో కేసులు వస్తుండడంతో కర్ఫ్యూను మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్టు తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వివరించారు. జనసమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలు, మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సమర్థవంతమైన మేనేజ్ మెంట్ ద్వారా ఎక్కువమంది ప్రజలకు టీకాలు వేయగలిగామని వ్యాఖ్యానించారు. కచ్చితమైన నిర్వహణ ద్వారా దాదాపు 11 లక్షల వ్యాక్సిన్ డోసులు ఆదా చేసినట్టు వివరించారు. ఐదేళ్ల లోపు పిల్లలున్న తల్లులందరికీ 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్టు వెల్లడించారు. 45 ఏళ్లకు పైబడిన వారికి టీకాల ప్రక్రియ పూర్తయ్యాక టీచర్లకు వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు.

విదేశాలకు వెళ్లేవారిలో ఇప్పటివరకు 31,796 మందికి వ్యాక్సిన్లు ఇచ్చినట్టు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల టీకాల కోటాను రాష్ట్రాలకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్టు సీఎం జగన్ వెల్లడించారు. గర్భిణులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా కొనసాగాలని నిర్దేశించారు. విజయవాడ, విశాఖ, తిరుపతిలో పిల్లల ఆసుపత్రుల పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, పీహెచ్ సీల్లోనూ ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య సబ్ సెంటర్లలో టెలీ మెడిసిన్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, కొవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/