కోడి కత్తి కేసు : ఏప్రిల్ 10 న విచారణకు హాజరు కావాలంటూ సీఎం జగన్ కు కోర్ట్ ఆదేశాలు

కోడి కత్తి కేసులో భాగంగా ఏప్రిల్ 10 న విచారణకు హాజరు కావాలంటూ సీఎం జగన్ కు ఆదేశాలు జారీ చేసింది విజయవాడ ఎన్ఐఏ కోర్టు. ఆయనతోపాటుగా పీఏ నాగేశ్వరరెడ్డి కూడా హాజరుకావాలని ఆదేశించింది. నేడు, ఎయిర్ పోర్టు అథారిటీ కమాండర్ దినేశ్ ను న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా పోలీసులు కోడికత్తిని, మరో చిన్న కత్తిని కోర్టుకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించిన ఓ సెల్ ఫోన్, పర్సును కూడా ఎన్ఐఏ ధర్మాసనానికి అందించారు.

అనంతరం, తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. ఎయిర్ పోర్ట్ క్యాంటిన్ లో పని చేసే.. శ్రీను అనే వ్యక్తి వీఐపీ లాంజ్ లోకి వెళ్లేందుకు అవకాశం కోసం చూశాడు. టీ, కాఫీలు ఇచ్చే ఉద్దేశంతో వెళ్లాడు. కోడికత్తితో జగన్ మీద దాడి చేశాడు. చిన్న గాయంతో జగన్ వెంటనే విమానం ఎక్కి వెళ్లిపోయారు. హైదరాబాద్ చేరుకుని.. ఆసుపత్రిలో చేరారు. తొమ్మిది కుట్లేసినట్టుగా వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనమైంది. శ్రీను జగన్ అభిమాని అని జగన్ పై సానుభూతి వచ్చేందుకు ఇలా చేశారని అని కొంతమంది అన్నారు. మరోవైపు ఇందులో టీడీపీ నేతల కుట్ర ఉందని వైస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ఈ కేసు ఎన్ఐఏకు వెళ్లింది. అప్పటి నుంచి విచారణ చేస్తూనే ఉంది.