రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌పై ఏపి సర్కార్‌కు చుక్కెదురు

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే.. ఎన్జీటీ తీర్పు

NGT

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల జలవివాదాల్లో పర్యావరణ అంశాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తీసుకోలేదంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేయగా, సెప్టెంబరు 3న విచారణ పూర్తిచేసిన ఎన్జీటీ తీర్పును పెండింగ్ లో ఉంచింది. తాజాగా తీర్పును వెలువరించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లేకుండా పనులు కొనసాగించవద్దని ఎన్జీటీ స్పష్టం చేసింది.

ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని ఎన్జీటీ తన తీర్పులో స్పష్టం చేసింది. ప్రాజెక్టులో తాగునీటి అవసరాలే కాకుండా సాగునీటి అవసరాలు కూడా ఉన్నాయని పేర్కొంది. ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించి పర్యావరణ అనుమతులు తీసుకోవాలని ఏపీ సర్కారును ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు సామర్థ్యం పెంచినందున పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచో వాదిస్తోంది. ఎన్జీటీ తీర్పుతో తెలంగాణ వాదనకు బలం చేకూరింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/