క్రికెట్‌ వరల్డ్‌కప్‌ వేదికలు

ప్రభాతవార్త స్పోర్ట్స్‌ ప్రతినిధి: వన్డే ప్రపంచకప్‌కు ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. మొత్తం 10దేశాలు పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌లో మే 30న ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా జరగనున్న తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దేశమైన ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి లండన్‌లోని కెన్నింగ్టన్‌ ఓవల్‌ మైదానం ఆతిథ్యమిస్తోంది. ఐసిసి వన్డే ప్రపంచకప్‌ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఈ వన్డే ప్రపంచకప్‌కు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఆతిథ్యమివ్వడం ఇదే ఆరోసారి కావడం విశేషం. మొత్తం 46రోజుల పాటు జరిగే ఈ వన్డే ప్రపంచకప్‌ మెగా టోర్నీకి మొత్తం 11వేదికలు ఆతిథ్యమివ్వనున్నాయి. ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తోన్న 11 వేదికల పూర్తి సమాచారం మీకోసం ప్రభాతవార్త ప్రత్యేకంగా అందిస్తుంది.

కెన్నింగ్టన్‌ ఓవల్‌ను ద ఓవల్‌ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అతి పురాతనమైన మైదానాల్లో ఇదొకటి. 1845లో ఈ స్టేడియం ప్రారంభమైంది. స్టేడియం కెపాసిటీ 25,500. ఇంగ్లాండ్‌ జట్టు తన మొట్టమొదటి టెస్టు మ్యాచ్‌ని ఈమైదానంలో ఆడింది. యాషెస్‌ అనే పేరు కూడా ఈ మైదానంలోనే వచ్చింది. ఈ మైదానంలో మే 30న ఇంగ్లాండ్‌-సౌతాఫ్రికా జట్ల మధ్య, జూన్‌ 2న సౌతాఫ్రికా-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య, జూన్‌ 5న బంగ్లాదేశ్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య, జూన్‌ 9న ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య, జూన్‌ 15న శ్రీలంక-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌ లు జరగనున్నాయి.
ట్రెంట్‌ బ్రిడ్జి-నాటింగ్‌ హామ్‌:
1841లో ఈ స్టేడియాన్ని నిర్మించారు. ఇంగ్లాండ్‌లోని నాటింగ్‌హామ్‌లో ఉన్న ఈ ట్రెంట్‌ బ్రిడ్జి స్టేడియం కూడా ఓ ఐకానిక్‌ వేదిక. ఈ స్టేడియం కెపాసిటీ 17,500. క్రికెట్‌ను వీక్షించేందుకు ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ స్టేడియాల్లో ఇదొకటి. 19వ శతాబ్ధంలో ఈస్టేడియం ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకు కూడా ఆతిథ్యమిచ్చింది. ఈ స్టేడియంలో మే 31న వెస్టిండీస్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య, జూన్‌ 3న ఇంగ్లాండ్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య, జూన్‌ 6న ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ జట్ల మధ్య, జూన్‌ 13న ఇండియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య, జూన్‌ 20న ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.
సోఫియా గార్డెన్స్‌-కార్డిఫ్‌:
సోఫియా గార్డెన్స్‌ స్టేడియంలో కార్డిఫ్‌లోని వేల్స్‌ నగరంలో ఉంది. ఈస్టేడియాన్ని కొంతమంది కార్డిఫ్‌ వేల్స్‌ స్టేడియం అని కూడా పిలుస్తారు. ఈ స్టేడియంలో తక్కువ దూరంలో స్ట్రయిట్‌ బౌండరీలతో పాటు దూర స్క్వేర్‌ బౌండరీలు ఉన్నాయి. ఈమైదానంలో జూన్‌ 1న న్యూజిలాండ్‌-శ్రీలంక జట్ల మధ్య, జూన్‌ 4న ఆప్గనిస్తాన్‌-శ్రీలంక జట్ల మధ్య, జూన్‌ 8న ఇంగ్లాండ్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య, జూన్‌ 15న సౌతాఫ్రికా-ఆప్గనిస్తాన్‌ జట్ల మధ్య ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.
కంట్రీ గ్రౌండ్‌-బ్రిస్టల్‌:
బ్రిస్టల్‌లోని కంట్రీ గ్రౌండ్‌ గ్లోసిస్టర్‌షైర్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తోంది. అయితే, ఇంగ్లాండ్‌లో అంత ఫేమస్‌ గ్రౌండ్‌ అయితే ఇది కాదు. ఈ స్టేడియం యొక్క నిర్మాణం విభిన్నంగా ఉండటంతో అప్పుడప్పుడు వన్డేలకు ఆతిథ్యమిస్తుంటుంది. కంట్రీ గ్రౌండ్‌ గుండ్రగా ఉంటుంది. అందుకే ఈ స్టేడియానికి ఐసిసి కేవలం మూడు మ్యాచ్‌లనే కేటాయించింది. ఈ స్టేడియంలో జూన్‌ 1న ఆప్గనిఆ్తన్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య, జూన్‌ 7న పాకిస్తాన్‌-శ్రీలంక జట్ల మధ్య, జూన్‌ 11న బంగ్లాదేశ్‌-శ్రీలంక జట్ల మధ్య ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ది రోస్‌బౌల్‌-సౌతాంప్టన్‌:
ఈ స్టేడియంలో రోస్‌ బౌల్‌ మాదిరి మూడంతస్తుల పెవిలియన్‌ ఉంటుంది. అంతేకాదు సౌతాంప్టన్‌ సిటీకి దూరంగా ఉంటుంది. ఇంగ్లాండ్‌లో ఉన్న అద్భుతమైన స్టేడియాల్లో సౌతాంప్టన్‌ స్టేడియం ఒకటి. సూర్యుడు ఉదయించే సమయంలో ఈ స్టేడియంలో మ్యాచ్‌ని వీక్షించడం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ మైదానంలో జూన్‌ 5న సౌతాఫ్రికా-ఇండియా జట్ల మధ్య, జూన్‌ 10న దక్షిణాఫ్రికా-వెస్టిండీస్‌ జట్ల మధ్య, జూన్‌ 14న ఇంగ్లాండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య, జూన్‌ 22న ఇండియా-ఆప్గనిస్తాన్‌ జట్ల మధ్య, జూన్‌ 24న బంగ్లాదేశ్‌-ఆప్గనిస్తాన్‌ జట్ల మధ్య ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ద కూపర్‌ అసోసియేట్స్‌ కంట్రీ గ్రౌండ్‌ – టౌన్‌టన్‌:
ఇంగ్లాండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు అధికారిక హోంగ్రౌండ్‌ ఇది. టౌన్‌ సెంటర్‌కు అతి సమీపంలో ఈస్టేడియాన్ని నిర్మించారు. టెస్టు మ్యాచ్‌లకు అప్పుడప్పుడు ఆతిథ్యమిచ్చే ఈ గ్రౌండ్‌ పరిమిత ఓవర్ల ఫార్మట్‌ మ్యాచ్‌లకు మాత్రం రెగ్యులర్‌గా ఆతిథ్యమిస్తుంది. ఈస్టేడియం కెపాసిటీ 12,500. 1882లో ఈస్టేడియాన్ని ఓపెన్‌ చేసినప్పటికీ మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్‌ మాత్రం 1983 క్రికెట్‌ ప్రపంచకప్‌ సమయంలో జరిగింది. ఈ స్టేడియంలో జూన్‌ 8న ఆప్గనిస్తాన్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య, జూన్‌ 12న ఆస్ట్రేలియా-పాకిస్తాన్‌ జట్ల మధ్య, జూన్‌ 17న వెస్టిండీస్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య వరల్డ్‌కప్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఓల్డ్‌ ట్రాపోర్డ్‌ – మాంచెస్టర్‌:
దక్షిణ మాంచెస్టర్‌ సిటీలో ఈ స్టేడియం ఉంది. ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌కి ఘనమైన చరిత్ర ఉంది. 1956లో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ టెస్టు క్రికెటర్‌ జిమ్‌ లేకర్‌ ఈ స్టేడియంలోనే ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీశాడు. ఈ స్టేడియం కెపాసిటీ 19వేలు. ఈ మైదానంలో జూన్‌ 16న ఇండియా-పాకిస్తాన్‌ జట్ల మధ్య, జూన్‌ 18న ఇంగ్లాండ్‌, ఆప్గనిస్తాన్‌ జట్ల మధ్య, జూన్‌ 22న వెస్టిండీస్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య, జూన్‌ 27న వెస్టిండీస్‌-ఇండియా జట్ల మధ్య, జూన్‌ 6న ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్ల మధ్య ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌లు జూలై 9న ప్రపంచకప్‌ మొదటి సెమీఫైనల్‌ మ్యాచ్‌ లీగ్‌ దశలో మొదటి,నాలుగో స్థానాల్లో నిలిచిన జట్ల మ్యాచ్‌ జరగనుంది.
ఎడ్జిబాస్టన్‌ – బర్మింగ్‌ హామ్‌:
ఇంగ్లాండ్‌లో ఉన్న అద్భుతమైన మైదానాల్లో ఎడ్జిబాస్టన్‌ స్టేడియం ఒకటి. ఇంగ్లాండ్‌లో ఈ మధ్యకాలంలో నిర్మితమైన స్టేడియాల్లో ఇదొకటి. ఈ క్రికెట్‌ స్టేడియం నుంచి మ్యాచ్‌ని వీక్షించడం చాలా అద్భుతంగా ఉంటుంది. 1994లో దుర్హం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ స్టేడియంలోని బ్రియాన్‌ లారా 501 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ స్టేడియంలోని స్కోరు బోర్డు సైతం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.ఈ స్టేడియంలో జూన్‌19న న్యూజిలాండ్‌-సౌతాఫ్రికా జట్ల మధ్య, జూన్‌ 26న న్యూజిలాండ్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య, జూన్‌ 30న ఇంగ్లాండ్‌-ఇండియా జట్ల మధ్య, జూలై 2న బంగ్లాదేశ్‌-ఇండియా జట్ల మధ్య ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌లు, జూలై 11న ప్రపంచకప్‌ రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ లీగ్‌ దశలో 2,3 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య జరగనున్నాయి.
హేడింగ్లే – లీడ్స్‌:
హేడింగ్లే ఈస్టేడియం పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చే పేరు సర్‌ డ్రాన్‌ బ్రాడ్‌మన్‌. ఈ స్టేడియంలో సర్‌ డ్రాన్‌ బ్రాడ్‌మన్‌ ఎన్నో రికార్డులను నమోదు చేశాడు. ఈస్టేడియంలో బ్రాడ్‌మన్‌ రెండు ట్రిపుల్‌ సెంచరీలు సాధించాడు. తొలుత 1930లో సాధించగా…ఆ తర్వాత 1934లో సాధించాడు. టెస్టుల్లో బ్రాడ్‌మన్‌ నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు (334)లో 309 పరుగులను ఒక్కరోజే ఈ స్టేడియంలో సాధించాడు. వీటితో పాటు ఈ స్టేడియంలో అనేక రికార్డులు నమోదయ్యాయి. ఈ స్టేడియం రెగ్యులర్‌గా టెస్టులు, వన్డేలకు ఆతిథ్యమిస్తుంది. ఈ మైదానంలో జూన్‌ 21న ఇంగ్లాండ్‌-శ్రీలంక జట్ల మధ్య, జూన్‌ 29న పాకిస్తాన్‌-ఆప్గనిస్తాన్‌ జట్ల మధ్య, జూలై 4న ఆప్గనిస్తాన్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య, జూలై 6న శ్రీలంక-ఇండియా జట్ల మధ్య ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.
లార్డ్స్‌ – లండన్‌:
క్రికెట్‌కు పుట్టినిల్లు. ప్రపంచంలోనే అత్యుత్తమ మైదానాల్లో ఇదొకటి. ఈ స్టేడియంలోని పెవిలియన్‌ కూడా ఓ ల్యాండ్‌మార్క్‌. క్రికెట్‌ అభిమానులు ముద్దుగా ‘హోం ఆఫ్‌ క్రికెట్‌ అని పిలుచుకుంటారు. ఇంగ్లాండ్‌ రాజధాని లండన్‌లో లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ సెంటర్‌లో ఉంటుంది. ఈ స్టేడియంలో జూన్‌ 23న పాకిస్తాన్‌-సౌతాఫ్రికా జట్ల మధ్య, జూన్‌ 25న ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య, జూన్‌ 29న న్యూజిలాండ్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య, పాకిస్తాన్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌లు, జూలై 14న ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.
రివర్సన్‌ గ్రౌండ్‌- చెస్టర్‌ లీ స్ట్రీట్‌:

గత కొన్ని సంవత్సరాలుగా చెస్టర్‌-లీ-స్ట్రీట్‌లోని ఈ రివర్సడ్‌ గ్రౌండ్‌ అనేక అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తోంది. ఈ స్టేడియంలోని స్టాండ్స్‌ చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి. దీంతో బ్యాట్స్‌మెన్‌ బౌండరీ బాదితే చాలా వెంటనే ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. 1999లో ఈస్టేడియంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ కూడా పాకిస్తాన్‌-స్కాట్లాండ్‌ జట్ల మధ్య జరిగింది. ఈ మైదానంలో జూన్‌ 28న శ్రీలంక-సౌతాఫ్రికా జట్ల మధ్య, జూలై 1న శ్రీలంక-వెస్టిండీస్‌ జట్ల మధ్య, జూలై 3న ఇంగ్లాండ్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.