ప్రపంచ చాంపియన్‌షిప్‌: మెరిసిన ఫొగట్‌

vinesh phogat
vinesh phogat

నూర్‌ సుల్తాన్‌(కజికిస్తాన్‌): ప్రపంచ  రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ మెరిశారు. మంగళవారం జరిగిన 53 కేజీల కేటగిరీ ఓపెనింగ్‌ రౌండ్‌లో వినేశ్‌ 12-0 తేడాతో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, స్వీడన్‌ రెజ్లర్‌ సోఫియా మాట్సన్‌పై ఘన విజయం సాధించారు. ఫలితంగా ప్రి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. ఎన్నో అంచనాలతో వరల్డ్‌ రెజ్లింగ్‌  చాంపియన్‌షిప్‌కు సిద్ధమైన వినేశ్‌.. భారీ విజయంతో బోణి కొట్టారు. తొలుత 4-0 తేడాతో ఆధిక్య సాధించిన వినేశ్‌.. అదే జోరును కడవరకూ కొనసాగించారు.

ఏ దశలోనూ సోఫియాకు అవకాశం ఇవ్వని వినేశ్‌.. చివరకు సోఫియాను మ్యాట్‌ నుంచి బయటకు నెట్టడంతో భారీ ఆధిక్యం సాధించారు. అయితే వినేశ్‌ గెలిచే క్రమంలో కాస్త నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సోఫియాను మొత్తం మ్యాట్‌ నుంచి ఔట్‌ చేసిన సమయంలో వినేశ్‌  కాలు లైన్‌ లోపల ఉందా.. బయట ఉందా అనే దానిపై స్పష్టత రాలేదు. అదే సమయంలో సోఫియా చాలెంజ్‌కు వెళ్లడంతో రిఫరీలు పలు కోణాలు పరిశీలించి వినేశ్‌ కాలు లైన్‌ లోపలే ఉందని తేల్చారు.