మృత్యువును అతి సమీపం నుంచి చూశాం : బంగ్లా క్రికెటర్లు

ఢాకా: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చి మసీదు నరమేధాన్ని సృష్టించిన కాల్పుల ఘటన నుంచి తృటిలో తప్పించుకున్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు…స్వదేశానికి చేరుకుంది. ఆదివారం తెల్లవారుజామున 17మంది సభ్యులు ఉన్న బంగ్లాదేశ్‌ జట్టు రాజధాని ఢాకా చేరుకుంది. ఆదేశ క్రీడా శాఖ మంత్రి జహీద్‌ ఎహసాన్‌ రస్సెల్‌, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ నజ్ముల్‌ హసన్‌, ఇతర అధికారులు వారికి ఢాకాలోని హజరత్‌ షా జలాల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మహమూద్‌ రియాద్‌ విలేకర్లతో మాట్లాడారు. న్యూజిలాండ్‌లో క్రైస్ట్‌చర్చిలో మసీదులో ప్రార్థనలకు వెళ్లిన తాము తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నామని కెప్టెన్‌ తెలిపారు. ఈ ఘటనపై వర్ణించడానికి తనకు ఇప్పటికీ మాటలు రావట్లేదని అన్నారు. ఆ షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నామని చెప్పారు. అయిదే ఐదు నిమిషాల్లో తాము కాల్పుల నుంచి బయిటపడ్డామని అన్నారు. ప్రజలు, అభిమానుల ప్రార్థనలవల్లే తాము సురక్షితంగా స్వదేశానికి తిరిగి రాగలిగామని రియాద్‌ అన్నారు. వీలైనంత త్వరగా తమను స్వదేశానికి చేర్చిన న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మృత్యువును అతి సమీపం నుంచి చూశామని, అదృష్టం బాగుండి బయిట పడ్డామని అన్నారు. అయిదు నిమిషాల ముందుగా తాము మసీదులోకి వెళ్లి ఉంటే…ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను ఊహించడానికి భయంగా ఉందని రియాద్‌ చెప్పారు.

https://www.vaartha.com/news/sports/
మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: