142ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి జెర్సీలపై పేర్లు

స్పోర్ట్స్‌ : 142ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో మరో అపురూపమైన ఘట్టానికి తెరలేవబోతుంది. సాధారణంగా వన్డేల్లో ఆటగాళ్లు వేసుకునే జెర్సీలపై పేర్లు ముద్రించబడి ఉంటాయి. వీటితోపాటు వారు ఎంచుకున్న జెర్సీలపై పేర్లు ముద్రించబడి ఉంటాయి. వీటితో పాటు వారు ఎంచుకున్న జెర్సీ నంబర్లు కూడా ఉంటాయి. జెర్సీపై ఉన్న నంబర్‌ను బట్టి ఆటగాడు ఎవరో ఇటే చెప్పేస్తారు క్రికెట్‌ అభిమానులు. అంతలా అభిమానులకు సుపరిచితం ఆ జెర్సీపై ఉన్న నంబర్లు. జెర్సీపై 10 ఉంటే సచిన్‌ అని, 7 ఉంటే ధోని అని, 18 ఉంటే కోహ్లీది అని అభిమానులు ఠక్కున చెప్పేస్తారు. అయితే, టెస్టుల్లో మాత్రం ఇందుకు భిన్నం, 142ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఏ మ్యాచ్‌లో కూడా ఆటగాళ్ల జెర్సీలపై పేర్లు, అంకెలు కనిపించింది లేదు. టెస్టుల్లో ఆడే ఆటగాళ్లు కేవలం తెలుపు లేదా గోధుమ రంగు జెర్సీలు ధరిస్తారు. జెర్సీ వెనుక భాగంలో ఖాళీగా ఉంటుంది తప్ప, నంబర్లు ఉండవు. అంతేకాదు టెస్టుల్లో టాస్‌ వేసేటప్పుడు ఇరు జట్ల కెప్టెన్లు బ్లేజర్లతో వెళ్లాలి. వన్డేల్లో మాత్రం అలా కాదు. అయితే, ఈ సంప్రదాయం త్వరలోనే మారబోతున్నట్లు సమాచారం. ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ ఏడాది ఆగస్టు నుంచి ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య యాషెస్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ యాషెస్‌ సిరీస్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు తమ తమ జెర్సీలపై పేర్లు, నంబర్లతో కనిపించనున్నారు. ఈ కొత్త సంప్రదాయానికి ఇరు దేశాలకు చెందిన బోర్డులు ఐసిసికి ప్రతిపాదన పంపాయి. ఈ ప్రతిపాదనను ఐసిసి గనుక ఆమోదం తెలిపితే పేర్లతో పాటు జెర్సీలపై నంబర్లలో కనిపించనున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌లో వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఐసిసి టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆరంభమవుతుంది. ఆటగాళ్లు ఒకటి నుంచి 99వరకు తమకు నచ్చిన నంబర్లను జెర్సీలపై ముద్రించేందుకు ఎంపిక చేసుకోవచ్చు.

https://www.vaartha.com/news/sports/
మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: