స్మిత్‌ మోసగాడిగానే గుర్తుండిపోతాడు: హార్మిసన్‌…

STEVE HARMISON
STEVE HARMISON


లండన్‌: ఆస్ట్రేలియా సారథి స్టీవ్‌స్మిత్‌పై ఇంగ్లాండ్‌ మాజీ పేసర్‌ స్టీవ్‌ హార్మిసన్‌ నోరు పారేసుకున్నాడు. అతననెప్పటికీ మోసగాడిగానే గుర్తుండి పోతాడని వెల్లడించాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌లో విజయాల్ల స్మిత్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మొదటి టెస్టులో రెండు శతకాలు, నాలుగో టెస్టులో ద్విశతకం బాదేశాడు. ఈరెండు మ్యాచుల్లో కంగారూలు విజయం సాధించారు. తన అద్వితీయ బ్యాటింగ్‌తో ఇంగ్లీష్‌ బౌలర్లకు స్మిత్‌ కొరకరాని కొయ్యగా మారాడు. ఇప్పటివరకు 134.20 సగటుతో 671 పరుగులు చేశాడు. అతడి అద్భుత బ్యాటింగ్‌ను అందరూ ప్రశంసిస్తుండగా హార్మిసన్‌ మాత్రం విరుద్ధంగా స్పందించాడు. కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో స్మిత్‌, వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌ బాల్‌ ట్యాంపరింగ్‌ చేయడంతో నిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అతడిని క్షమిస్తారని అనుకోను. ఒక వ్యక్తి మోసగాడని తెలిశాక నేను తియ్యగా మాట్లాడలేను. ఆ ముగ్గురూ మోసం చేశారు. వారి క్రికెట్‌ జీవితంలో అది ఎప్పటికీ కనిపిస్తుంది. వారెంత బాగా ఆడినా మంచి పేరు తెచ్చుకోలేదు. స్మిత్‌ ఏం చేసినప్పటికీ దక్షిణాఫ్రికాలో జరిగిందనానికి అతనెప్పుడూ మోసగాడిగానే గుర్తుంటాడు. స్మిత్‌, వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌పై ఎవరైనా అభిప్రాయం మార్చుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే వారు ఆటకు అపప్రద తీసుకొచ్చారని హార్మిసన్‌ అన్నాడు. ఇంగ్లాండ్‌ జట్టుకు హార్మిసన్‌ 63 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. అందులో ఐదు యాషెస్‌ మ్యాచ్‌లు ఉన్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/