దుబాయ్ ఓపెన్‌ బరిలో దిగనున్న సానియా

Sania Mirza
Sania Mirza

దుబాయ్‌: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గత జనవరిలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీతో రీఎంట్రీ ఘనంగా ఇచ్చింది. రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఏకంగా టైటిల్ సాధించింది. నదియా కిచెనోక్ (ఉక్రెయిన్)తో కలిసి బరిలోకి దిగిన సానియా.. ఫైనల్లో పోరాడి టైటిల్ గెలిచింది. హోబర్ట్ టోర్నీ అనంతరం ఆస్ట్రేలియా ఓపెన్‌ టోర్నీలో పోటీపడిన సానియా మీర్జా కాలికి గాయం కావడంతో ఆరంభంలోనే నిష్క్రమించింది. గాయం నుంచి వేగంగా కోలుకున్న సానియా ..రెండు వారాల్లోనే మళ్లీ ఫిట్‌నెస్‌ సాధించింది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న దుబాయ్ ఓపెన్‌లో బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించింది. బుధవారం జరిగే తొలి రౌండ్‌లో రష్యాకు చెందిన కుద్రయోత్సోవాకేటరినా శ్రీబోట్నిక్‌ జోడీతో సానియాకరోలినా గార్షియా (ఫ్రాన్స్‌) జంట తలపడనుంది. ఆస్ట్రేలియా ఓపెన్‌ తొలి రౌండ్‌ నుండే గాయంతో వెనుదిరగడం ఎంతో బాధించిందని సానియా పేర్కొంది. ‘ఆస్ట్రేలియా ఓపెన్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడం బాధించింది. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇలా జరగడం బాధే. తిరిగి ఫిట్‌నెస్ సాధించడంలో డాక్టర్‌ హయత్ ఖాన్‌ ఎంతో సహాయం చేసారు. ఇప్పటికే నేను ప్రాక్టీస్ మొదలెట్టాను. దుబాయ్ ఓపెన్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తా’ అని సానియా తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/