ప్రత్యర్థి కళ్లలో భయం చూడాలనుకున్నా: కోహ్లీ…

kohil
kohil


న్యూఢిల్లీ: ప్రస్తుతం అన్ని ఫార్మట్లలోనూ పరుగుల వరద పారిస్తున్నాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ. ఇప్పుడు కోహ్లీ ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌. కోహ్లీ బరిలోకి దిగాడంటే ప్రత్యర్థి జట్లు భయపడతాయి. అతడు క్రీజులో ఉన్నంతసేపు విజయంపై ఆశలు వదులుకోవాల్సిందే. అయితే కెరీర్‌ తొలి రోజుల్లో 2012 వరకు ప్రత్యర్థి కళ్లలో భయం, గౌరవం ఉండేవి కావు. తననెవరూ లెక్కచేసేవారు కాదని కోహ్లీ అంటున్నాడు. ఒక స్పోర్ట్స్‌ వెబ్‌షోకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కోహ్లీ పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు. కెరీర్‌ ప్రారంభంలో నన్ను చూసి ప్రత్యర్థి జట్టు భయపడ్డ, గౌరవించిన సందర్భాలు లేవు. ఎందుకంటే 2012కు ముందు నేనో సాధారణ ఆటగాడిని. ప్రత్యర్థి జట్లు అసలు నాగురించి ఆలోచించేవి కావు. ఇలా వచ్చి అలా వెళతాడనే భావనలో ఉండేవి.

బౌలర్లు కూడా తేలిగ్గా తీసుకునేవారు. కానీ నేనలా ఉండాలని కోరుకోలేదు. క్రీజులోకి వస్తుంటే ఇతన్ని త్వరగా అవుట్‌ చేయాలి..లేకుంటే మ్యాచ్‌ ఓడిపోతామనే భయం ప్రత్యర్థుల్లో ఉండాలనుకున్నానని కోహ్లీ తెలిపాడు. 2012 ఆసీస్‌ పర్యటన తర్వాత ఆ జట్టుకు, మాకున్న తేడా స్పష్టంగా తెలిసింది. దీంతో శిక్షణ, డైటింగ్‌, ఆటతీరు మార్చుకోకుంటే అత్యుత్తమ స్థాయిని కనబర్చలేమని అర్థమైంది. ఆ దిశగా ఆడే ప్రయత్నం చేశా. ముఖ్యంగా ఫిట్‌నెస్‌ నన్ను పూర్తిగా మార్చివేసింది. అలాగే ఆడే తీరు కూడా మారింది. ప్రపంచకప్‌లో వరుసగా మ్యాచ్‌లు ఆడినా అలసిపోలేదు. ప్రతీ మ్యాచ్‌కు నా ఎనర్జీ స్థాయి 120శాతంగా ఉంది. ఇదంతా ఫిట్‌నెస్‌ వల్లే సాధ్యమైందని కోహ్లీ పేర్కొన్నాడు. చదువుకునే రోజుల్లో గణితం అంటే చాలా భయం. ఆ సమయంలో గణితంలో పడిన కష్టం క్రికెట్‌ ఆడేటప్పుడు ఎప్పుడూ పడలేదు. 100మార్కులకు కేవలం 3 మార్కులే వచ్చాయంటే అర్థం చేసుకోండి. ఎలాగైనా గణితంలో పాస్‌ మార్కులు వస్తే చాలనుకున్నా. దానికోసం పడ్డ కష్టం అంతా ఇంతా కాదు అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/