కెఎల్‌ రాహుల్‌ను హత్తుకున్న హార్థిక్‌ పాండ్యా…

hardik pandya
hardik pandya

ముంబయి: ముంబయి ఇండియన్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఓ అందమైన ఘటన చోటుచేసుకుంది. ముంబయి ఆల్‌రౌండర్‌ హార్థిక్‌ పాండ్యా పంజాబ్‌ ఓపెనర్‌ కెఎల్‌ రాహుల్‌ను హత్తుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతుండగా అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే…బుధవారం మ్యాచ్‌లో పంజాబ్‌ ఓపెనర్లు రాహుల్‌ (100నాటౌట్‌), క్రిస్‌ గేల్‌ (63) దూకుడుగా ఆడి ముంబయి ముందు భారీ టార్గెట్‌ నిర్ధేశించారు. రాహుల్‌ చివరి మూడు ఓవర్లలో బ్యాట్‌ ఝుళిపించి ఐపిఎల్‌లో మొదటి శతకం సాధించాడు. కాగా హార్థిక్‌ పాండ్యా వేసిన 19వ ఓవర్‌లో మూడు సిక్సులు ఒక ఫోర్‌ కొట్టి మొత్తం 25 పరుగులు రాబట్టాడు. దీంతో పంజాబ్‌ 197 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే పంజాబ్‌ ఇన్నింగ్స్‌ అనంతరం పాండ్యా క్రీడాస్పూర్తిలో భాగంగా రాహుల్‌ను హత్తుకొని మెచ్చుకున్నాడు. ఈ వీడియో చూసిన అభిమానులు. వీరిద్దరినీ ఇలా చూడటం బాగుందని కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో పాండ్యా నాలుగు ఓవర్లు వేసి 57 పరుగులు ఇచ్చాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబయి 8 ఓవర్లకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా పొలార్డ్‌ (31 బంతుల్లో 3ఫోర్లు, 10సిక్సులతో 83) విధ్వంసకర బ్యాటింగ్‌తో ముంబయిని ఆదుకున్నాడు. చివరి ఓవర్‌లో మూడు బంతుల్లో నాలుగు పరుగులు చెయ్యాల్సిన పరిస్థితిలో అల్జెరీ జోసెఫ్‌, రాహుల్‌ చాహర్‌ కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో పంజాబ్‌పై ముంబయి ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. ఇదిలా ఉండగా గతేడాది రాహుల్‌, హార్థిక్‌ పాండ్యా ఓ టివి కార్యక్రమంలో పాల్గొని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు నిషేధానికి గురై ఆపై తిరిగి జట్టులో చేరారు. ప్రస్తుతం ఐపిఎల్‌లో వీరిద్దరూ మంచి ప్రదర్శన చేస్తున్నారు. ఏదేమైనా వీరిద్దరినీ ఇలా చూడటం అభిమానులకు తెగ సంతోషం కలుగుతోంది.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/sports/