శతకంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన కెఎల్‌ రాహుల్‌….

K. L. Rahul
K. L. Rahul

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌ ముంగిట కెఎల్‌ రాహుల్‌ మెరుపు శతకంతో మళ్లీ టీమిండియా రేసులోకి వచ్చేశాడు. వాంఖడే వేదికగా ముంబయిలో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన కెఎల్‌ రాహుల్‌ (64బంతుల్లో 6ఫోర్లు, 6సిక్సులతో 100నాటౌట్‌) అజేయ శతకంతో పంజాబ్‌ జట్టుకి 197 పరుగుల భారీ స్కోరు అందించాడు. ఐపిఎల్‌ కెరీర్‌లో రాహుల్‌కి ఇదే తొలి శతకం కాగా…తాజా సీజన్‌లో సంజు శాంసన్‌, జానీ బెయిర్‌స్టో, డేవిడ్‌ వార్నర్‌ తర్వాత శతకం సాధించిన నాలుగో క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. మే 30 నుంచి ఇంగ్లాండ్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ మొదలుకానుండగా…ఈనెల 15న సెలెక్టర్లు భారత్‌ జట్టుని ప్రకటించనున్న విషయం తెలిసిందే. అయితే..మొన్నటి వరకు ఈటీమ్‌ రేసులో లేని రాహుల్‌…బుధవారం శతకం చేయడంతో సెలెక్టర్లు తన గురించి ఆలోచించేలా చేశాడు. ఐపిఎల్‌ 2017 సీజన్‌ మొత్తానికి భుజం గాయం కారణంగా దూరమైన కెఎల్‌ రాహుల్‌…ఆ తర్వాత 2018 సీజన్‌లో వరుస అర్థశతకాలతో పంజాబ్‌కి ఒంటిచేత్తో విజయాల్ని అందించాడు. ఆ ఫామ్‌ని పరిగణనలోకి తీసుకున్న సెలెక్టర్లు…ఇంగ్లాండ్‌ పర్యటనకి ఎంపిక చేయగా…ఆఖరి టెస్టులో సెంచరీ మినహా…రాహుల్‌ తేలిపోయాడు. దీంతో…ఆ తర్వాత వెస్టిండీస్‌తో సిరీస్‌కి, ఆస్ట్రేలియా పర్యటనలోనూ రాహుల్‌ తుది జట్టులో చోటు కోసం నిరీక్షించాల్సి వచ్చింది. మధ్యలో కాఫీ విత్‌ కరణ్‌ టాక్‌ షో కారణంగా…అతనిపై కొన్ని రోజుల నిషేధం వేటు కూడా పడింది. దీంతో…ఐపిఎల్‌కి ముందు జరిగిన ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ ఈ ఓపెనర్‌ అవకాశాలు రాలేదు. ఈ దెబ్బతో ప్రపంచకప్‌కి రాహుల్‌ ఎంపికవడం అనుమానమేననే వార్తలు వచ్చాయి. దీంతో…రాహుల్‌ ఆత్మవిశ్వాసం కూఆ సన్నగిల్లినట్లు కనిపించింది. ప్రపంచకప్‌ జట్టులో మూడో ఓపెనర్‌, నెం.4స్థానం, రెండో వికెట్‌ కీపర్‌ కోసం తీవ్ర పోటీ నెలకొనగా…కెఎల్‌ రాహుల్‌ తాజా శతకంతో….రెండు స్థానాలకి తాను గట్టి పోటీదారుడిగా మారాడు. ఒకవేళ మూడో ఓపెనర్‌గా రాహుల్‌ని సెలెక్టర్లు ఎంపిక చేసినా…అతడ్ని నాలుగో స్థానంలోనూ ఆడించే అవకాశాలు లేకపోలేదు. గత కొద్దిరోజుల ఉంచి నెం.4 స్థానం కోసం అంబటి రాయుడు, అజింక్యా రహానె, కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తీక్‌, కెఎల్‌ రాహుల్‌ పేర్లు వినిపించగా…ఈ జాబితాలో రాహుల్‌ మినహా ఎవరూ తాజా ఐపిఎల్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయారు.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/sports/