ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన ఎంఎస్‌ ధోనీ

‘ధోనీ’నా మజాకా.. దద్దరిల్లిన స్టేడియం

MS Dhoni practicing on sets at MA Chidambaram stadium
MS Dhoni practicing on sets at MA Chidambaram stadium

చెన్నై: ఈనెల 29న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్‌) సీజన్13 మొదలవనుండగా.. చెన్నై క్రికెట్ అభిమానులను అప్పుడే ఐపిఎల్‌ ఫీవర్‌ పట్టుకుంది. అందుకు కారణం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ మళ్లీ బ్యాట్‌ పట్టడమే. ఈ సీజన్‌ ఐపిఎల్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీ ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. సోమవారం ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో మహీ పాల్గొన్నాడు. నెట్స్‌లో కాసేపు బ్యాటింగ్‌ చేశాడు. హిట్టింగ్‌తో ఫ్యాన్స్‌ను ధోనీ అలరించాడు. చాలా కాలం తర్వాత మహీ సన్నాహకానికి దిగడంతో.. విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి వచ్చారు. అతడు బ్యాటు పట్టి అడుగుపెట్టే సమయంలో చిదంబరం స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది. అభిమానులు ‘ధోనీ..ధోనీ.. ధోనీ.. ధోనీ’ అంటూ నినాదాలు చేశారు.

ధోనీ సాధనకు సంబంధించిన వీడియోను చెన్నె సూపర్‌ కింగ్స్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షల్లో కామెంట్లు వచ్చాయి. ఇక మహీ ఫాన్స్ తమదైన స్టయిల్లో కామెంట్లు చేస్తున్నారు. ‘ధోనీ’నా మజాకా అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. ‘మహీ బ్యాట్ పట్టడం చాలా సంతోషంగా ఉంది’ అని మరో అభిమాని కామెంట్ చేసాడు. ధోనీతో పాటు సురేష్ రైనా, అంబటి రాయుడు, మురళీ విజయ్‌, పీయూష్ చావ్లా, కరణ్ శర్మ మరికొందరు ప్లేయర్లు ప్రాక్టీస్‌ చేశారు. రాయుడు బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/