విశాఖ విమానాశ్రయంలో కోహ్లీసేన ఇబ్బందులు…

indian team
indian team

వైజాగ్‌: విశాఖపట్నం విమానాశ్రయంలో టీమిండియా క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడ్డారు. పోలీసుల అవగాహన లోపంతో వర్షంలో తడిచి లోపలికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం మ్యాచ్‌ ముగిసింది. సోమవారం రెండు జట్లు పూణెకు బయిల్దేరాయి. వారు బసచేసిన ప్రాంతం నుంచి బోర్డు ఏర్పాటు చేసిన బస్సుల్లో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ మూడు ఫ్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. పోలీసులు అవగాహన లోపంతో భారత జట్టు ప్రయాణిస్తున్న బస్సును మూడో ఫ్లాట్‌ఫారం వద్ద ఆపారు. అక్కడ ఎలాంటి పైకప్పు లేదు. పైకప్పు ఉన్న ప్రాంతానికి వెళ్లేలోపు వర్షం పడింది. లగేజీ, కుటుంబ సభ్యులు ఉండటంతో ఆటగాళ్లు ఇబ్బందులు పడ్డారు. వర్షంలో తడిచి లోపలికి వెళ్లారు. మొదటి ఫ్లాట్‌ఫారంలో బస్సు ఎందుకు పార్క్‌ చేయలేదని ఎయిర్‌పోర్టు సిఐని ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ప్రశ్నించాడని సమాచారం. కాగా తొలి ఫ్లాట్‌ఫారంలో దక్షిణాఫ్రికా జట్టు ప్రయాణిస్తున్న బస్సును పోలీసులు నిలిపారని తెలిసింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/sports/