బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలను నిర్వహించడం ఒక ఛాలెంజ్

గత మూడేళ్లుగా బీసీసీఐ పరిస్థితి బాగోలేదు

Sourav Ganguly
Sourav Ganguly

న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పగ్గాలు చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక కానున్నారు. 47 ఏళ్ల గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో గంగూలీ మాట్లాడుతూ, బీసీసీఐ అధ్యక్షుడు కావడమనేది ఒక గొప్ప అనుభూతి అని చెప్పారు. భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే కాకుండా జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించిన తనకు ఇది ఒక గొప్ప అనుభూతి అని అన్నారు. గత మూడేళ్లుగా బీసీసీఐ పరిస్థితి బాగోలేదని, ఇమేజ్ దెబ్బతిందని… ఇలాంటి స్థితిలో తాను పగ్గాలు చేపట్టబోతున్నానని చెప్పారు. బీసీసీఐ ఇమేజ్ ను మళ్లీ పెంచడానికి ఇది తనకొక గొప్ప అవకాశమని తెలిపారు.

డొమెస్టిక్ క్రికెట్ ను బలోపేతం చేసే క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడమే తన ప్రథమ కర్తవ్యమని గంగూలీ చెప్పారు. తన తొలి ప్రాధాన్యత ఫస్ట్ క్లాస్ క్రికెటర్లే అయినప్పటికీ… తన ఆలోచనపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. బీసీసీఐ అడ్వైజరీ కమిటీకి గత మూడేళ్లుగా తాను ఇదే విషయం చెబుతున్నానని… అయితే వారు పట్టించుకోలేదని చెప్పారు. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ అతి పెద్ద ఆర్గనైజేషన్ అని, ఆర్థికంగా ఒక పవర్ హౌస్ వంటిదని… అలాంటి బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలను నిర్వహించడం ఒక ఛాలెంజ్ అని తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/