ఐపిఎల్‌ ఫామ్‌ ఆధారంగా కోహ్లీని అంచనా వేయొద్దు: వెంగ్‌ సర్కార్‌…

Dilip Vengsarkar
Dilip Vengsarkar

న్యూఢిల్లీ: ఐపిఎల్‌ఫామ్‌ ఆధారంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని అంచనా వేయొద్దు…అతని సామర్థ్యాన్ని నిందించడం సరికాదని భారత జట్టు మాజీ కెప్టెన్‌, మాజీ సెలెక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ అంటున్నారు. ఐపిఎల్‌ 2019 సీజన్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అత్యంత దారుణంగా ప్రారంభించింది. వరుసగా మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ఆర్‌సిబి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై విమర్శల వర్షం కురుస్తోంది. ఐపిఎల్‌ ప్రభావం రానున్న ప్రపంచకప్‌ సీజన్‌పై పడితే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. ఇక అభిమానులు అయితే ఏకంగా కోహ్లీని ప్రపంచకప్‌ సారథ్య బాధ్యతల నుంచి తప్పించి…రోహిత్‌ శర్మకు అప్పగించాలని అంటున్నారు. ఈనేపథ్యంలో విరాట్‌ కోహ్లీకి దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ అండగా నిలిచారు. తాజాగా వెంగ్‌సర్కార్‌ మాట్లాడుతూ…ఐపిఎల్‌ ప్రదర్శన పరిగణనలోకి తీసుకుని ఎవరినీ నిందించడం సరికాదు. కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతను ప్రపంచ గొప్ప ఆటగాళ్లలో ఒకడు. కెప్టెన్‌గా కూడా అద్భుతంగా రాణించాడు. ఇప్పటికీ వన్డే, టెస్టులలో నిరూపించుకున్నాడు. అతని మీద నమ్మకం ఉంది. 100శాతం సక్సెస్‌ అవుతాడని వెంగ్‌సర్కార్‌ అన్నారు. టీమిండియాకు మంచి బౌలింగ్‌ ఉంది. ఇప్పటివరకు భారత్‌ తరుపున ప్రపంచకప్‌ ఆడిన జట్లలో ఇదే అత్యుత్తమం. గతంలో చివరి 10 ఓవర్లలో టీమిండియా తేలిపోయేది. ఇప్పుడు మాత్రం బాగా రాణిస్తోంది. భువి, బుమ్రాలో చివరి 10ఓవర్లు బాగా వేస్తున్నారు. భారత్‌ కచ్చితంగా కప్‌ గెలుస్తుందని వెంగ్‌సర్కార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. రోహిత్‌ కూడా రాణిస్తున్నాడన్నాడు. అయితే ఈ ఇద్దరిపై మాత్రం ఆధారపడకూడదు. ఇతర ఆటగాళ్లు కూడా పరుగులు చేయాలి. ఇద్దరు త్వరగా అవుట్‌ అయితే మిగతా వారి మీద ఒత్తిడిపడే అవకాశం ఉంది. నాలుగో స్థానంలో చాలా మంది పోటీలో ఉన్నా…కెఎల్‌ రాహుల్‌, అజింక్యా రహానెలకు అవకాశం ఇవ్వాలి. మయాంక్‌ అగర్వాల్‌ కూడా ఆసీస్‌ సిరీస్‌లో రాణించాడు. అతన్ని పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించిందని వెంగ్‌ సర్కార్‌ చెప్పుకొచ్చారు.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/sports/