బెంగుళూరు జట్టులోకి డేల్ స్టెయిన్…

బెంగుళూరు: దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టులో చేరుతున్నాడా…? అంటే అవుననే అంటున్నారు ఆ జట్టు అభిమానులు. స్టెయిన్ ఐపిఎల్ 2019 సీజన్లో ఆడటానికే భారత్‌కు వస్తున్నాడని ఆర్సిబి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఇండియా వీసాకు సంబంధించిన ఫోటోను స్టెయిన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో 8అహ్హా…ఏంటీ సర్ఫ్రైజ్ అనే క్యాప్షన్‌తో షేర్ చేయడంతో ఈవార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సీజన్లో పేలవ ప్రదర్శనతో ఆర్సిబి చెత్త రికార్డును మూటగట్టుకున్న విషయం తెలిసిందే. వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడి అభిమానులకు తీరని మనోవ్యథను మిగిల్చింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో స్టెయిన్ జట్టులో చేరితే ఆర్సిబికి కలిసొస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నాథన్ కౌల్టర్ నీల్ స్థానంలో స్టెయిన్ తుది జట్టులోకి వస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. తమకు మంచి రోజులు రాబోతున్నాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక స్టెయిన్ ఆర్సిబి జట్టులో చేరితే ఆజట్టుకు కలిసొచ్చే అంశమే. గత ఆరుమ్యాచుల్లో వారి బౌలింగ్ విభాగం తేలిపోయింది. భారీ లక్ష్యాలను కూడా కాపాడుకోలేక ఆ జట్టు చేతులెత్తేసింది. ముఖ్యంగా ఆజట్టులో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ లేక పరాజయాలను చవిచూసింది. ఒకవేళ స్టెయిన్ జట్టులో చేరితే మాత్రం ఆలోటు తీరనుంది. ఇక 2008 సీజన్ నుంచి 2010వరకు స్టెయిన్ ఆర్సిబి జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు. 2011లో డెక్కన్ చార్జెర్స్ తరుపున ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ జట్ల తరుపున కూడా బరిలోకి దిగాడు. ఇక ఈ విషయంపై ఆర్సిబి జట్టు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేకపోయినప్పటికీ…స్టెయిన్ జట్టులో చేరే అవకాశం లేదని మాత్రం చెప్పలేమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దక్షినాఫ్రికా మాజీ కెప్టెన్ డివిలియర్స్ జట్టులో ఉండటంతో స్టెయిన్ రాకను కొట్టిపారేయలేమంటున్నారు.
మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/sports/