రూ.10కోట్లు కట్టండంటూ దావా వేసిన ఆసీస్‌ పేసర్‌…

Mitchell Starc
Mitchell Starc

సిడ్నీ: ఆస్ట్రేలియా పేస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ లండన్‌కు చెందిన లాయిడ్‌ అనే ఇన్సూరెన్స్‌ సంస్థపై 1.53మిలియన్‌ డాలర్లు (రూ.10కోట్లు)కు పైగా దావా వేశాడు. ఈ మేరకు సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ ఓ కథనంలో పేర్కొంది. వివరాల్లోకి వెళితే…గతేడాది నిర్వహించిన ఐపిఎల్‌ వేలంలో మిచెల్‌స్టార్క్‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వేలంలో రూ.12.5కోట్లకు సొంతం చేసుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టులోక్రిస్‌లిన్‌ తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కూడా నిలిచాడు. అయితే, గతేడాది సఫారీ గడ్డపై జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో టెస్టులో మిచెల్‌ స్టార్క్‌కు గాయం కావడంతో ఐపిఎల్‌ 2018 సీజన్‌ మొత్తానికి మిచెల్‌ స్టార్క్‌ దూరమైన సంగతి తెలిసిందే. మరోవైపు ఇదే సిరీస్‌లో బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం కారణంగా స్టీవ్‌ స్మిత్‌,డేవిడ్‌ వార్నర్‌లు సైతం గత సీజన్‌ ఐపిఎల్‌కు దూరమయ్యారు. అయితే గాయం లేదా మరే ఇతర కారణాలతో ఐపిఎల్‌ ఆడని పక్షంలో తనకు ఇన్సూరెన్స్‌ చెల్లించేలా అతను లాయిడ్‌ సంస్థతో మిచెల్‌ స్టార్క్‌ ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో భాగంగా అతడు ఆ సంస్థకు రూ.68లక్షల దాకా ప్రీమియం చెల్లించాడు. గత ఐపిఎల్‌ వేలం ముగిసిన వెంటనే స్టార్క్‌ లాయిడ్‌ సంస్థనుంచి ఇన్సూరెన్స్‌ తీసుకున్నాడు. ఈ సంస్థ సంప్రదాయ ఇన్సూరెన్స్‌ సంస్థలు ఇవ్వని భిన్నమైన పాలసీలు ఇస్తుంది. అయితే, గాయం కారణంగా తాను ఐపిఎల్‌కు దూరమైనప్పటికీ…లాయిడ్‌ సంస్థ తనకు ఇన్సూరెన్స్‌ చెల్లించకపోవడంతో స్టార్క్‌ తరుపు న్యాయవాదులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మిచెల్‌ స్టార్క్‌ తనకు 1.5మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.10.39కోట్లు) చెల్లించాలని దావా వేశాడు. గాయం నుంచి కోలుకున్న మిచెల్‌ స్టార్క్‌ ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించాడు. మే 30నుంచి ఇంగ్లాండ్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోవాలని చూస్తున్నాడు.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి :https://www.vaartha.com/news/sports