యూఎస్‌ ఓపెన్‌ విజేత ఆండ్రిస్యూ

Bianca Andreescu
Bianca Andreescu

ఫైనల్‌ పోరులో సెరెనాను మట్టి కరిపించిన బియాంకా…


న్యూయార్క్‌: టెన్నిస్‌ చరిత్రలో అత్యధిక టైటిళ్లు సాధించాలనుకున్న అమెరికా తార సెరెనా విలియమ్స్‌ కలను కెనడా అమ్మాయి బియాంకా ఆండ్రస్కూ అడ్డుకుంది. యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో దిగ్గజ క్రీడాకారిణి సెరెనాను యువ కెరటం బియాంకా మట్టికరిపించింది. మహిళల సింగిల్స్‌ తుదిపోరులో తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆడుతున్న కెనడియన్‌ బియాంక ఆండ్రిస్యూ(19) మాజీ ప్రపంచ నంబన్‌వన్‌, పదోసారి యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరిన అగ్రశ్రేణి అమెరికన్‌ టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌పై విజయం సాధించింది. ఆర్థర్‌ ఆషే స్టేడియంలో ఆదివారం జరిగిన మహిళల ఫైనల్స్‌లో బియాంక ఆండ్రిస్యూ 6-3, 7-5 తేడాతో సెరెనాపై గెలిచింది. హోరాహోరీ పోరులో ధీటైన ఆటతో విన్నర్‌గా నిలిచిన ఆండ్రిస్యూ ఈ విజయంతో గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ సాధించిన తొలి కెనడియన్‌గా నిలిచింది.

ఇప్పటివరకు గ్రాండ్‌స్లామ్‌లో రెండో రౌండ్‌ కూడా దాటని బియాంక టైటిల్‌ను నెగ్గి రికార్డులు సృష్టించింది. . గత 13ఏళ్లలో టైటిల్‌ను అందుకున్న తొలి టీనేజర్‌గానూ రికార్డు సృష్టించింది. 24వ గ్రాండ్‌స్లామ్‌ అందుకోవాలనుకున్న సెరెనా తుదిపోరులో ప్రత్యర్థి ముందు తలవంచింది. తొలి సెట్‌లో బియాంకా ఆధిపత్యం ఏకపక్షంగా సాగినా రెండో సెట్‌లో సెరెనా ప్రతిఘటించింది. కానీ బియాంక చెలరేగి రెండో సెట్‌ను కూడా కైవసం చేసుకొని విజేతగా నిలిచింది.

దాంతోపాటు పిన్నవయసులో (19ఏళ్లు) గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించిన మహిళగా ఆమె రికార్డు సృష్టించింది. ఇదిలా ఉండగా…గత రెండేళ్లలో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో పాల్గొనేందుకు కూడా ఆండ్రిస్యూ అర్హత సాధించకపోవడం గమనార్హం. ఇక ఈ విజయంతో ఓపెన్‌ శకంలో అత్యధిక యూఎస్‌ గ్రాండ్‌ స్లామ్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను సాధించిన రికార్డును సొంతం చేసుకోవాలనుకున్న సెరెనాకు నిరాశ తప్పలేదు. ఇప్పటివరకు ఆమె ఆరు యూఎస్‌ ఓపెన్‌ టైటిల్స్‌ గెలిచింది. ఇక 2017 ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ సాధించిన తర్వాత మహిళల సింగిల్స్‌గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ అనేది సెరెనాకు అందరి ద్రాక్షగానే ఉంది. గతేడాది యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరినప్పటికీ జపాన్‌ క్రీడాకారిణి ఒసాకా చేతిలో సెరెనా పరాజయం పాలై రన్నరప్‌గా సరిపెట్టుకున్నారు. 2014లో చివరిసారి యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ టైటిల్‌ను గెలిచారు సెరెనా. ఆమె ఇప్పటివరకు 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సొంతం చేసుకున్నారు. మరో టైటిల్‌ గెలిస్తే…అత్యధిక సార్లు గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ సాధించిన మార్గరెట్‌ కోర్టు (24 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌) ఆల్‌టైమ్‌ రికార్డును సెరెనా సమం చేసేది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/h