3డీ ట్వీట్‌పై అంబటి రాయుడు స్పందన

Ambati Rayudu
Ambati Rayudu

న్యూఢిల్లీ: ప్రతిభావంతుడైన క్రికెటర్ గా గుర్తింపు వచ్చినా, జాతీయ జట్టులో అవకాశం మాత్రం ఆలస్యంగా అందుకున్నాడు. అయితే, వరల్డ్ కప్ సందర్భంగా రాయుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాడు. తనను కాదని విజయ్ శంకర్ ను ఎంపిక చేయడంతో ఈ తెలుగు బ్యాట్స్ మన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. విజయ్ శంకర్ ఎంపికకు కారణం చెబుతూ, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు కోణాల్లో ఉపయోగపడే ఆటగాడు అని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.

అయితే, రాయుడు దీనిపై వ్యంగ్యం ప్రదర్శిస్తూ, వరల్డ్ కప్ మ్యాచ్ లు చూసేందుకు ఇప్పుడే 3డీ గ్లాసెస్ కు ఆర్డర్ ఇస్తానంటూ ట్విట్టర్ లో సెటైర్ వేశాడు. తాజాగా నాటి తన ట్వీట్ పై రాయుడు స్పందించాడు. వరల్డ్ కప్ జట్టులోకి తనను ఎంపిక చేయకపోవడంతో ఆ విధంగా స్పందించానని, అయితే ఆ 3డీ ట్వీట్ తన కెరీర్ పై ప్రభావం చూపుతుందని భావించడంలేదని స్పష్టం చేశాడు. ఒకవేళ ఆ ట్వీటే తన కెరీర్ ను దెబ్బతీస్తే ఆ ఊహే భరించలేనని వ్యాఖ్యానించాడు. ప్రపంచకప్ లో ఆడేందుకు ఎంతో కష్టపడ్డానని, నెం.4 స్థానంలో రాణించేందుకు చాలా శ్రమించానని, సెలెక్టర్ల నిర్ణయంతో తన ఆశలన్నీ అడియాసలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/