విజయం దిశగా ఆసీస్‌

ASISS
ASISS

విజయం దిశగా ఆసీస్‌

ప్రభాతవార్త స్పోర్ట్స్‌ ప్రతినిధి: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ని వైట్‌వాష్‌ చేసే దిశగా ఆస్ట్రేలియా దూసుకెళ్తోంది. సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఆస్ట్రేలియా విజయం దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా చివరిదైన సిడ్నీ టెస్టులో కూడా ఆస్ట్రేలియన్లు తమ హవాను కొనసాగిస్తున్నారు. నాలుగో రోజైన ఆదివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బారిస్టో (17), జో రూట్‌ (42) పరుగులతో ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 649/7 వద్ద డిక్లేర్‌ చేసింది. ఓవర్‌ నైట్‌ స్కోరు 479/4తో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌కు షాన్‌ మార్ష్‌ ( 291 బంతుల్లో 18ఫోర్లతో 156 పరుగులు), మిచెల్‌ మార్ష్‌ (141 బంతుల్లో 15ఫోర్లు,న రెండు సిక్సలతో 101 పరుగులు)ల జోడి భారీ స్కోరు అందించారు. వరుసగా సెంచరీ సాధించిన ఈ అన్నదమ్ములు ఐదో వికెట్‌కి 169 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 346 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో 303 పరుగుల వెనుకంజలో ఉన్న ఇంగ్లాండ్‌ ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌ ఆడుతుంది. ఇంగ్లాండ్‌ జట్టు ఓటమిని తప్పించుకోవాలంటే ఇంకా 210 పరుగులు చేయాల్సిఉంది. ===