టెస్టుల్లో అగ్ర‌స్థానం కొన‌సాగాల‌నేదే త‌మ ధ్యేయంః ర‌హానే

Ajinkya Rahane
Ajinkya Rahane

కోల్‌కతా: ఈడెన్‌ గార్డెన్స్‌లో ప్రాక్టీస్‌ సందర్భంగా టీమిండియా బ్యాట్స్‌మన్‌ అజింక్యా రహానె కాసేపు మీడియాతో ముచ్చ‌టించాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ శ్రీలంక టీమ్‌ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదని అన్నారు. లంకను వారి సొంతగడ్డపైనే 9-0తో క్లీన్‌ స్విప్‌ చేసిన భారత్‌.. టాప్‌ ర్యాంక్‌ను మరింతగా పటిష్టం చేసుకోవడంపైనే దృష్టిసారించిందని, శ్రీలంకలో ఆడిన దానికి.. ఇప్పుడు జరగబోయే సిరీస్‌కు ఎంతో తేడా ఉందని అన్నాడు. ‘టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగాలనేదే మా ధ్యేయం. ఈ నేపథ్యంలో ప్రతి సిరీస్‌నూ నెగ్గడం ఎంతో ముఖ్యమ‌ని తెలిపాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో భారత్‌.. లంకతో సిరీస్‌లో అన్ని విభాగాలను సిద్ధం చేసుకోవాలని చూస్తోంది. ‘సఫారీ టూర్‌ ముందు ప్రతి మ్యాచ్‌, ప్రతి సిరీస్‌ ముఖ్యమే. అయితే దక్షిణాఫ్రికాకు వెళ్లినప్పుడు అప్పటి పరిస్థితులు ఆలోచిస్తాం. ప్రస్తుతం మా దృష్టంతా లంకతో సిరీస్‌పైనేన’ని రహానె తెలిపారు.