టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆప్గనిస్తాన్‌…


డెహ్రడూన్‌: సంచలనాల ఆప్గనిస్తాన్‌ టీ20 ఫార్మట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. డెహ్రడూన్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆప్గనిస్తాన్‌ టీ20ల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆప్గనిస్తాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278పరుగు చేసింది. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2016లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 263 పరుగులు చేసింది. ఇప్పుడు హజ్రతుల్లా జాజా§్‌ు అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆప్గనిస్తాన్‌ జట్టు ఆస్ట్రేలియా రికార్డును బద్దలుకొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆప్గాన్‌కు ఓపెనర్లు చక్కటి శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా హజ్రతుల్లా జజా§్‌ు (62బంతుల్లో 11ఫోర్లు, 16సిక్సులతో 162నాటౌట్‌) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్లు, బౌండరీలతో విధ్వంసం సృష్టించాడు. మరో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఘనీ (48బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సులతో 73) అర్థ సెంచరీతో రాణించాడు. అనంతరం భారీ లక్ష్యంతో దిగిన ఐర్లాండ్‌ కూడా ధాటిగానే ఛేదన ఆరంభించింది. ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ (91)దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. కానీ అతనికి మిగతా బ్యాట్స్‌మెన్‌ నుంచి సహకారం లేకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐర్లాండ్‌ ఆరు వికెట్ల నష్టానికి 194 పరుగులకే పరిమితమైంది. దీంతో 84 పరుగులు తేడాతో ఓటమిపాలైంది.
ఈమ్యాచ్‌లో నమోదైన రికార్డులు…

  • సెంచరీకి హజ్రతుల్లా ఆడిన బంతులు 42. అంతర్జాతీయ టీ20ల్లో ఇది మూడో వేగవంతమైన సెంచరీ.
  • ఈమ్యాచ్‌లో ఆప్గనిస్తాన్‌ స్కోరు 278పరుగులు. టీ20ల్లో అత్యధిక స్కోరు ఇది. 2016లో శ్రీలంకపై ఆస్ట్రేలియా (263/3) నెలకొల్పిన రికార్డు బద్దలైంది.
  • ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో హజ్రతుల్లా, ఘని తొలి వికెట్‌కు జోడించిన పరుగులు 236. ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో రెండు జట్ల మధ్య 472 పరుగులు నమోదు కావడం ఇది మూడో అత్యధికం.
  • ఈమ్యాచ్‌లో హజ్రతుల్లా కొట్టిన సిక్సులు 16. వ్యక్తిగత టీ20 ఇన్నింగ్స్‌లో ఇవే అత్యధికం. అంతేకాదు టీ20 ఇన్నింగ్స్‌ల్లో ఎక్కువ సిక్సర్లు (21) నమోదు చేసిన జట్టుగా ఆప్గాన్‌ రికార్డు సృష్టించింది.