జూనియర్‌ హాకీ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌

women
Women Hockey Team

జూనియర్‌ హాకీ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌

భోపాల్‌ : ఇక్కడ జరుగుతున్న జాతీయ బాలబాలికల జూనియర్‌ హాకీ చాంపియన్‌షిప్‌లోఆంధ్రప్రదేశ్‌ బాలికలు ఫైనల్స్‌కు చేరుకున్నారు. శుక్రవారం హోరాహోరీగా జరిగిన తొలి సెమీస్‌లో 1-0గోల్‌తో కేరళపై చెమటోడ్చి నెగ్గి ఫైనల్లో అడుగుపెట్టింది. ఆట ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈనే పథ్యంతో ఆట ఆద్యంతం ఉత్కంఠగా సాగి ప్రథమార్థం ముగిసేసరికి 0-0 గోల్స్‌ లేమితో సమవుజ్జీగా నిలిచాయి. ద్వితీయార్థంలో దూ కుడు ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్‌ బాలికలు ప్రత్యర్థిపై పట్టు బిగించారు. పదేపదే గోల్‌పోస్టుపై దాడికి పూనుకోవడంతో ప్రత్యర్థి రక్షణ వలయం కకావికలైంది.దీన్ని అదునుగా తీసుకున్న ఫార్వర్డులు గోల్‌ పోస్టు వైపు దూసుకెళ్లడంతో డిఫెండర్లు చెల్లా చెదురైన నేపథ్యంలో స్పందన 48వ నిమిషంలో అద్భుత రీతిలో ఫీల్డ్‌గోల్‌ సాధించి జట్టుకు 1-0 గోల్‌ ఆధిక్యాన్నిచ్చింది. ఆత్మరక్షణలో పడ్డ కేరళ బాలికలు పట్టు కోసం యత్నించి విఫలమయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ తన ఆధిక్యాన్ని నిలుపుకోవడంలో సఫలమై విజయం సాధించింది.శనివారం జరిగే రెండో సెమీస్‌లో బిహార్‌తో రాజస్థాన్‌ తలపడనుంది. ఇద్దరిలో గెలిచే జట్టుతో ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆడనుంది.కాగా,అంతకు ముందు ఏక పక్షంగా జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో విదర్భపై 11-0 గోల్స్‌తో ఆంధ్రప్రదేశ్‌ నెగ్గి సెమీస్‌కు చేరింది.బాలుర విభాగం సెమీస్‌లో హాకీ రాయలసీమ (ఆంధ్ర) 0-6 గోల్స్‌తో బిహార్‌ చేతిలో ఘోరంగా ఓటమి చెందింది. ప్రథమార్థంలో 0-4 గోల్స్‌తో వెనుక బడ్డ ఆంధ్ర ఏదశలోను కోలుకోలేదు. దీంతో ద్వితీయార్థంలో బిహార్‌ మరో రెండు గోల్స్‌చేసి ఘన విజయం సాధించింది.