ఇంగ్లాండ్ క్రికెట‌ర్ బెన్‌కు ఊర‌ట‌

Ben stokes
Ben stokes

లండన్‌: ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌కు బ్రిస్టల్‌ క్రౌన్‌ కోర్టులో ఊరట లభించింది. గతేడాది సెప్టెంబర్‌లో న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సమయంలో బెన్‌ స్టోక్స్ బ్రిస్టల్‌లోని ఓ నైట్‌క్లబ్‌ వెలుపల తప్పతాగి ఒక వ్యక్తిని చితక బాదినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అతనిపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కొద్ది రోజుల పాటు నిషేధాన్ని విధించింది. అయితే ఇప్పుడు ఈ కేసును బ్రిస్టల్‌ క్రౌన్‌ కోర్టు విచారణ జరిపి తుది తీర్పునిచ్చింది. 12 మందితో కూడిన ధర్మాసనం స్టోక్స్‌ ఆత్మరక్షణ కోసమే దాడి చేశాడన్న వాదనని నమ్ముతూ అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. టీమిండియాతో జరగబోయే మూడో టెస్టుకు అతను అందుబాటులో ఉండనున్నాడు. అయితే టీం ఇండియాతో నాటింగ్‌హామ్‌ వేదికగా ఆగస్టు 18 నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టుకు ప్రకటించే జట్టు ఎంపికపై ఇంగ్లండ్ బోర్డు తికమకపడుతోంది. తొలి టెస్ట్‌లో ఆరు వికెట్లు తీసి.. విజయంలో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్‌ రెండో టెస్ట్‌కి అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో క్రిస్‌ వోక్స్‌ని జట్టులోకి తీసుకున్నారు. అయితే తనకు దక్కిన చోటుని వోక్స్ సద్వినియోగం చేసుకున్నాడు. రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఇప్పుడు వీరిద్దరిలో ఎవరిని తీసుకోవాలా అని ఇంగ్లండ్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సందిగ్ధంలో పడింది.