తెలుగు రాష్ట్రాల్లో తానా చైత‌న్య స్ర‌వంతి కార్య‌క్ర‌మాలు

TANA
TANA

అమెరికాలో నాలుగు దశాబ్దాలకుపైగా తెలుగు కమ్యూనిటీకి విస్తృతంగా సేవలందిస్తూ, మరోవైపు తెలుగు భాష, తెలుగు కళలు, తెలుగు సంస్కృతి విస్తరణకు కృషి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం మాతృరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలో కూడా అనేక కార్యక్రమాలను చేస్తోంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి అమెరికాలో పెద్దఎత్తున తానా మహాసభలను నిర్వహిస్తూ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కళాకారులను, తెలుగు ప్రముఖులను ఈ మహాసభలకు ఆహ్వానించడం ద్వారా అమెరికాలో తెలుగు వైభవాన్ని మహాసభల ద్వారా తెలియజేస్తోంది. వచ్చే సంవత్సరం జూలై 4 నుంచి 6 వ తేదీ వరకు తానా 22వ మహాసభలు వాషింగ్టన్‌ డీసిలో జరగనున్నాయి. ఈ మహాసభలకు ముందుగా మాతృరాష్ట్రంలో ‘చైతన్య స్రవంతి’ పేరుతో తెలుగు భాషాభివృద్ధిని ప్రోత్సహించేలా, మరుగునపడిన జానపదకళలను వెలుగులోకి తీసుకు వచ్చేలా తానా పలు కార్యక్రమాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్‌ 23 నుంచి జనవరి 12వ తేదీ వరకు తానా చైతన్యస్రవంతి కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నట్లు ‘తానా’ అధ్యక్షుడు సతీష్‌ వేమన తెలిపారు.