జైలుకి వెళ్లడానికైనా సిద్ధం

Priyanka Gandhi
Priyanka Gandhi

లఖ్‌నవూ: కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల ఓ భూ వివాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆదివాసీల కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న ఆమెను శుక్రవారం పోలీసులు మధ్యలోనే అడ్డుకొని చునార్‌ అతిథి గృహానికి తరలించిన విషయం తెలిసిందే.అయితే బాధిత కుటుంబాలను కలిసే వరకూ కదిలేదని భీష్మించిన ప్రియాంక.. అర్థరాత్రి వరకు తన మద్దతుదారులతో అతిథి గృహ ఆవరణలోనే ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఆమె అక్కడే ఉండి నిరసన కొనసాగిస్తున్నారు. అక్కడి నుంచి వ్యక్తిగత పూచీకత్తుతో వెళ్లాలని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కోరినప్పటికీ ఆమె ససేమిరా అన్నారు. ఆమెని ఒప్పించడానికి ప్రయత్నించిన అధికారులు అర్ధరాత్రి దాటిన తరవాత ఎలాంటి ఫలితం లేకుండానే వెళ్లిపోవాల్సి వచ్చింది. అనంతరం ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబాలను కలిసే వరకు వెళ్లేది లేదు. ప్రభుత్వం తరఫున వచ్చిన దూతలకు కూడా నేను అదే చెప్పాను. బాధితులకు అండగా ఉండడం కోసం జైలుకి వెళ్లడానికైనా సిద్ధం. ఎలాంటి ఆధారాలు లేకుండానే పోలీసులు నన్ను అదుపులోకి తీసుకున్నారు. 144 సెక్షన్‌ ఉన్నందున కేవలం ఇద్దరు వ్యక్తులం మాత్రమే వెళ్తామని కూడా చెప్పాం. అయినా వారు మాపై చర్యలకు సిద్ధపడ్డారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/