మరో మూడు అత్యాచార ఘటనలు

బలరామ్ పూర్ లో 22 ఏళ్ల యువతిపై అత్యాచారం

Woman raped in sangareddy
Woman raped

లక్నో: ఉత్తరప్రదేశ్ లో హత్రాస్‌ ఘటన మరువక ముందే మరో మూడు ఘోరాలు వెలుగు చూశాయి. వీటిల్లో రెండు యూపీలోనే జరుగగా, ఒకటి మధ్య ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. యూపీలోని ఓ మారుమూల గ్రామంలో 22 ఏళ్ల దళిత యువతిని సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. బలరామ్ పూర్ గ్రామానికి చెందిన యువతి, తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, సామూహిక అత్యాచారం జరిగినట్టు పోస్టుమార్టం నిర్ధారించింది. ఆమె శరీరంపై పలు చోట్ల గాయాలు కూడా ఉన్నాయని వైద్యుల నివేదిక పేర్కొంది. కాలేజీ అడ్మిషన్ కోసం తన తల్లితో కలసి వెళుతుంటే, లాక్కెళ్లిన దుండగులు ఈ దురాగతానికి పాల్పడ్డారు.

ఇక మరో ఘటనలో అజామ్ గఢ్ ప్రాంతంలో 8 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. ఈ కేసులో నిందితుడి వయసు 20 సంవత్సరాలు. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంది. మాయమాటలతో బాలికను నమ్మించి, తన ఇంటికి తీసుకెళ్లిన నిందితుడు, ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక తీవ్ర రక్త స్రావంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడు ధనుష్ ని గుర్తించి, అరెస్ట్ చేశామని తెలిపారు. ఇదే సమయంలో మరో ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. పట్టపగలు, పొలంలో ఓ మైనర్ బాలికను ముగ్గురు అత్యాచారం చేశారు. ఖర్గోనే జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, పలు గ్రామాల ప్రజలు తీవ్ర నిరసనలకు దిగడంతో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.

తమ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు, తనను కొట్టి, తన చెల్లిని లాక్కెళ్లారని, ఆపై చెల్లెలి కోసం గ్రామస్థులతో కలిసి వెతుకగా, ఊరిబయట ప్రాణాపాయ స్థితిలో కనిపించిందని ఆమె అన్న బోరున విలపిస్తూ చెప్పాడు. ఈ కేసులో నిందితుల కోసం గాలింపు మొదలు పెట్టామని జిల్లా ఎస్పీ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఇక ఒకే రోజు మూడు ఘటనలు వెలుగులోకి రావడంతో, దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తమ నిరసనలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. వీటిపై వెంటనే తీవ్ర నిరసనలకు దిగాలని పలు ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/