కశ్మీర్‌ అంశంపై స్పష్టతనిచ్చిన రాజ్‌నాథ్‌

కశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వం ప్రశ్నే లేదు

Rajnath Singh
Rajnath Singh

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కశ్మీర్‌ విషయంలో చేసిన వ్యాఖ్యలు ఈరోజు మరోసారి లోక్‌సభలో గందరగోళం చేశాయి. నేడు ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే కాంగ్రెస్‌ ఈ అంశాన్ని లేవనెత్తింది. ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ డిమాండ్‌ చేసింది. ఇతర విపక్ష పార్టీల నేతలు కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తూ ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఈ విషయంలో మోదీ మౌనంగా ఉండటం సరికాదని విమర్శించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ దీనిపై సమాధానం చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్షాలు వినిపించుకోలేదు. మోదీనే నేరుగా మాట్లాడాలని పట్టుబట్టాయి. అనంతరం కేంద్రం తీరును నిరసిస్తూ ప్రతిపక్ష నేతలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కశ్మీర్‌ వివాదంపై స్పందించారు. కశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వం ప్రశ్నే లేదని, మోదీట్రంప్‌ భేటీలో ఆ విషయం చర్చకు రాలేదని ఆయన స్పష్టం చేశారు. భారత ఆత్మగౌరవం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. కశ్మీర్‌ విషయంలో ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని మేం అంగీకరించబోం. ఇది మన గౌరవానికి సంబంధించిన విషయం. అంతేగాక మధ్యవర్తిత్వం అనేది శిమ్లా ఒప్పందానికి విరుద్ధంగ అని రాజ్‌నాథ్ తెలిపారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/