విక్రమ్ ఆనవాళ్లను గుర్తించిన సుబ్రమణియన్

ల్యాండ్ కావడానికి ముందు, క్రాష్ అయిత తర్వాత చిత్రాలను అధ్యయనం చేసిన వైనం

Shanmuga Subramanian
Shanmuga Subramanian

చెన్నై: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్2లో భాగమైన విక్రమ్ ల్యాండర్ సాంకేతిక కారణాలతో కూలిపోయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో చివరి క్షణాల్లో అది క్రాష్ ల్యాండ్ అయింది. దాని ఆచూకీని కనిపెట్టడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తీవ్రంగా శ్రమించిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు విక్రమ్‌ కచ్చితమైన జాడ ఒక భారతీయుడికే చిక్కింది. చెన్నైకి చెందిన ఓ సాధారణ ఇంజినీర్ షణ్ముగ సుబ్రమణియన్. విక్రమ్ ల్యాండర్ కూలిపోయిన ప్రాంతానికి సంబంధించిన చిత్రాలను అధ్యయనం చేసిన వాటి శకలాలు ఉన్న ప్రాంతాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విక్రమ్ ఆనవాళ్లను నాసా గుర్తించకపోవడం తనలో ఆసక్తిని పెంచిందని చెప్పారు. నాసా విడుదల చేసిన రెండు చిత్రాలను తన లాప్ టాప్ లో పక్కపక్కనే పెట్టుకుని తేడాను గమనించడం మొదలు పెట్టానని తెలిపారు. విక్రమ్ ఆనవాళ్లను గుర్తించడం చాలా కష్టమైన పనే అయినప్పటికీ.. తన వంతు ప్రయత్నాన్ని తాను చేశానని చెప్పారు. ఆ తర్వాత తాను కనుక్కున్నదాన్ని అక్టోబర్ 3న ట్విట్టర్ ద్వారా వెల్లడించానని తెలిపారు.

విక్రమ్ పయనించిన మార్గాన్ని తాను నిశితంగా అధ్యయనం చేశానని సుబ్రమణయన్ చెప్పారు. తనకు స్పేస్ టెక్నాలజీ అంటే చాలా ఇష్టమని… ఏ ఒక్క రాకెట్ లాంచ్ ను చూడటాన్ని కూడా తాను మిస్ కాలేదని తెలిపారు. సుబ్రమణియన్ ఇచ్చిన సమాచారంపై ఆ తర్వాత నాసా మరింత లోతుగా అధ్యయనం చేసింది. రెండు నెలల తర్వాత విక్రమ్ ఆనవాళ్లను గుర్తించినట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా నాసాకు చెందిన ఓ అత్యున్నత శాస్త్రవేత్త మాట్లాడుతూ, సుబ్రమణియన్ అధ్యయనం అద్భుతమని కితాబిచ్చారు. విక్రమ్ ఆనవాళ్లను తాము గుర్తించడానికి ఆయన ఇచ్చిన సమాచారం ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. నాసాకు చెందిన ఎల్ఆర్వోకు కానీ, చంద్రయాన్2 మిషన్ కు కానీ సుబ్రమణియంకు సంబంధం లేదని…. కానీ, వ్యక్తిగత ఆసక్తితో తమ డేటాను ఉపయోగించుకుని… తాము గుర్తించలేని స్పాట్ ను గుర్తించారని ప్రశంసించారు. నాసా చిత్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారని… ఒక్కో పిక్సెల్ ను నిశితంగా గమనిస్తూ స్పాట్ ను కనిపెట్టారని తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/