సోనియా చచ్చిన ఎలుకతో సమానం: మనోహర్‌లాల్‌ ఖట్టర్‌

manohar lal khattar
manohar lal khattar

చండీగఢ్‌: కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాపై మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ చేసిన విమర్శలు కాంగ్రెస్‌లో తీవ్ర దుమారాన్ని రేపాయి. మూడు నెలల పాటు కొత్త అధ్యక్షుడి కోసం దేశమంతా గాలించారని, ఆ తరువాత సోనియాగాంధీనే మళ్లీ తీసుకొచ్చారని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని, అది కూడా చచ్చిన ఎలుకను అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఇంత ఘోరమైన స్థితిలో ఉందన్నారు. ఖట్టర్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. ఖట్టర్‌ చేసిన వ్యాఖ్యల్లో మహిళా వ్యతిరేక గుణాలు ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానా ముఖ్యమంత్రి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకు బీహార్‌ నుంచి కోడళ్లను తెచ్చుకున్నామని ఇకపై కాశ్మీర్‌ నుంచి తెచ్చుకోవచ్చంటూ ఖట్టర్‌ రెండు నెలల క్రితం కూడా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పెనుదుమారాన్ని రేపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేశారు. గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తి కొత్త అధ్యక్షుడు అవుతారని ఆయన చెబుతూ వచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/